ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మరో రెండేళ్ల తరువాత కేంద్రాన్ని శాసించనున్నారా ? అంటే అవుననే ఆయన కేబినెట్ సహచరుడు కొడాలినాని అంటున్నారు . రెండేళ్ల తరువాత రాజ్యసభ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెరగనున్న నేపధ్యం లో , తమ   పార్టీ అధినేత మాట కేంద్రం వద్ద చెల్లుబాటు కానుందని ఆయన  చెప్పుకొచ్చారు . ప్రస్తుతం రాజ్యసభ లో వైస్సార్ కాంగ్రెస్ కు కేవలం ఇద్దరు సభ్యుల బలం మాత్రమే ఉండగా , ఏపీ త్వరలోనే మరో నాలుగు స్థానాలు ఖాళీకానున్నాయి .

 

ఈ నాలుగు స్థానాలు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరనున్నాయి . ఇక 2021లోను మరో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడం , ఆ నాలుగు అధికార పార్టీ ఖాతాలోనే చేరడం ఖాయమైన నేపధ్యం లో, రెండేళ్ల తరువాత  రాజ్యసభ లో వైస్సార్ కాంగ్రెస్ సభ్యుల బలం పదికి  చేరనుంది . ప్రస్తుతం రాజ్యసభ లో అధికార ఎన్డీఏ కు సరిపడా మెజార్టీ లేక , లోక్ సభ ఆమోదించిన బిల్లుల కోసం రాజ్యసభ లో ఆమోదింప చేసుకోవడానికి  మిత్రపక్షాలపై , ఇతర ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతున్న విషయం తెల్సిందే . ఉభయ సభలు  ఇటీవల ఆమోదించిన  పలు బిల్లులకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభ లో మద్దతు ప్రకటించింది .

 

కేవలం ఇద్దరు సభ్యులున్నప్పుడే కేంద్రంలోని ఎన్డీఏ కూటమి  బిల్లులు ఆమోదించుకునేందుకు తమని సంప్రదిస్తోన్న నేపధ్యం లో ఇక పది  మంది సభ్యుల బలం ఉంటే తాము చెప్పిందే వేదం కాగలదని కొడాలినాని చెప్పుకొచ్చారు . అంటే కేంద్రం నుంచి ఏమైన  సాధించుకురావాలంటే మరో రెండేళ్ల వరకు వేచి చూడాల్సిందేనని నాని చెప్పకనే చెప్పారని రాజకీయ  విశ్లేషిస్తున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: