ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఈనాడు అధినేత రామోజీరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎన్డీఏలో కలుస్తామని తాను అనని మాటలు అన్నట్టు ఈనాడు దిన పత్రిక రాసిందన్నది మంత్రి బొత్స అభ్యంతరం. అందుకే బాగా మండిపడుతున్న బొత్స సత్యనారాయణ మొన్న రామోజీరావు పేరుతో ఓ బహిరంగ లేఖ రాశారు.

 

తాను అనని మాటలు అన్నట్టు రాశారని..అందుకే ఈనాడు పత్రికలో సవరణ కూడా వేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. తన వార్త వేసిన ఫస్ట్ పేజీలోనే సవరణ కూడా వేయాలని డిమాండ్ చేశారు. కానీ ఈ డిమాండ్ కు ఈనాడు పత్రిక ఆయన ఆశించిన స్థాయిలో స్పందించలేదు. మొదటి పేజీల్లో కాకుండా లోపలి పేజీల్లో బొత్స వార్త వేశారు. అది కూడా సవరణ తరహాలో కాకుండా బొత్స ఇలా అన్నారు.. అలా అన్నారు అంటూ రాశారు.

 

ఈనాడు వార్తతో సంతృప్తి చెందని బొత్స సత్యనారాయణ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఈనాడుపై విమర్శలు గుప్పించారు. వ్యక్తుల కోసం వ్యవస్థలను ఈనాడు రామోజీరావు నాశనం చేయడానికి పూనుకున్నాడని మంత్రి బొత్స అన్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచురించారని, దానిపై తాను లేఖ రాస్తే దానిని కూడా సరిగా రాయలేదని ఆయన అన్నారు. చంద్రబాబు కోసం రామోజీ ఇంతగా దిగజారుతున్నారని మంత్రి బొత్స అన్నారు.

 

రామోజీకి ఎనభై ఏళ్ల వయసు వచ్చిందని, ఈ వయసులో కూడా ఆయన ఇలా చేయాలా అని బొత్స ప్రశ్నించారు. తాము ఎక్కడా ఎన్.డి..తో కలిసి వెళతామని అనలేదని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబందించి విశాఖలో చేసిన వ్యాఖ్యల వీడియోను బొత్స ప్రదర్శించారు. ఈనాడు రాసిన వార్తలను చూసి కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కూడా రాశాయని మంత్రి బొత్స అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: