ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యం కేంద్రంగా ఆయ‌న‌కు షాకిచ్చేందుకు 
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే పంటి కింద రాయిలా మారిన వివిధ రాష్ట్రాల‌ను అనుస‌రిస్తూ...కేసీఆర్ సైతం ముందుకు సాగనున్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. సుమారు ఏడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాల‌పై క్యాబినెట్‌ విస్తృతంగా చర్చించింది. ఈ సంద‌ర్భంగా సీఏఏకు వ్య‌తిరేకంగా తీర్మానం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

 


భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని తెలంగాణ మంత్రివర్గం కేంద్రప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్నిమతాలను సమానంగా చూడాలని సూచించింది. భారతరాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని       (సీఏఏ) రద్దుచేయాలని కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు రాష్ట్రమంత్రివర్గ సమావేశం తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇందుకు సంబంధించిన తీర్మానం చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

 

కాగా, కేర‌ళ ప్ర‌భుత్వం ఉత్కంఠభ‌రిత ప‌రిణామాల్లో సీఏఏ బిల్లును ఆమోదింప‌చేసిన సంగ‌తి తెలిసిందే. బడ్జెట్ ​సెషన్ ​ప్రారంభిస్తూ గవర్నర్​ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగించారు. బడ్జెట్ స్పీచ్​లో సీఏఏ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో ప్రభుత్వంతో ఏకీభవించకపోయినా, సీఎం కోరిక ప్రకారం దీనిని చదువుతున్నా అని చెప్పి, ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. ఇది సీఏఏపై ప్రభుత్వ అభిప్రాయమే కానీ తనది కాదని చెప్పారు. ‘మతం ఆధారంగా పౌరసత్వం కల్పించడం సెక్యులరిజానికి వ్యతిరేకం.. మన రాజ్యాంగానికి పునాది సెక్యులరిజమే. మతం ఆధారంగా పౌరసత్వం కల్పించేందుకు తీసుకొచ్చిన సీఏఏ మన రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, సీఏఏను రద్దు చేయాలని  కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై సుప్రీంకోర్టులో సూట్​ కూడా ఫైల్​ చేసింది’ అని గవర్నర్‌‌ పేర్కొన్నారు. తర్వాతి పేరాలో.. ‘బలమైన కేంద్ర, రాష్ట్రాలే ఫెడరలిజానికి పునాదులు. జాతీయ ప్రయోజనాల విషయంలో రాష్ట్రాల భయాందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా రాజ్యాంగ విలువలతో ముడిపడిన అంశమైతే ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యే అవకాశం ఉంది’ అంటూ గవర్నర్​ ప్రసంగించారు. ఏదేమైన‌ప్ప‌టికీ....కేర‌ళ స‌ర్కారు నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా అదే బాట‌లో న‌డ‌వాల‌ని కేసీఆర్ స‌ర్కారు డిసైడ‌యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: