మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య కాలంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా వైసీపీ పార్టీ నిర్ణయాలకు మద్దతు ఇస్తుండగా తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటన చేసి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. కడప నగరంలో సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా నిన్న కేశినేని నాని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. 
 
అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అవగాహన లేకనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ కు మద్దతు తెలిపామని చెబుతున్నారని అవగాహన లేని వారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. పేదలకు ఎన్‌పీఆర్‌, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వలన తీవ్ర నష్టం జరుగుతుందని కేశినేని నాని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీడీపీ ఈ తీర్మానాన్ని అంగీకరించాలని అన్నారు. 
 
టీడీపీ ఈ తీర్మానాన్ని అంగీకరించని పక్షంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. 22 మంది వైసీపీ ఎంపీలు, ఇద్దరు టీడీపీ ఎంపీలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు అనుకూలంగా ఓట్లు వేశారని పార్లమెంటులో తానొక్కడినే సభ నుండి వాకౌట్ చేశానని చెప్పారు. రాజకీయాల కోసం ముస్లింలను తాను వాడుకోబోనని కేశినేని నాని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింలు సోదరులుగా స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం పోరాడారని చెప్పారు 
 
కులాలు, మతాల పేరుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ అరాచకాలు చేస్తోందని చెప్పారు. తాను ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని కేశినేని నాని స్పష్టం చేశారు. మనస్సాక్షికి అనుగుణంగానే ఈ విషయంలో ముందుకెళతానని కేశినేని నాని చెప్పారు. వైసీపీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి టీడీపీ ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వకపోతే మాత్రం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీకి సైతం వ్యతిరేకంగా వెళతానని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: