హీరోగా కెరీర్‌ టాప్‌ ఫాంలో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్‌, సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఒక దశలో ఇక సినిమాలు  చేయనంటూ ప్రకటించేశాడు కూడా. పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటానని గత ఎన్నికల్లో పోటి చేశాడు. అయితే ప్రజలు వెండితెర మీద ఆదరించినట్టుగా పవన్‌ను రాజకీయాల్లో ఆదరించలేదు. దీంతో పవన్‌ పార్టీకి దారుణమైన రిజల్ట్స్‌ వచ్చాయి. ఎన్నికల తరువాత కూడా కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపిన పవన్‌ ప్రస్తుతం తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టాడు. వరసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఈ విషయంలో అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్‌.


జనసేన పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నానని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నాడు. తనకు వచ్చే ఆదాయంపైనే కుటుంబం, పార్టీ ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని, అందుకే సినిమాలు చేయక తప్పడం లేదని చెప్పాడు. రాజకీయాల్లో వేలకోట్లు సంపాదించాలనే ఆలోచనతో రాలేదని, సొంత డబ్బు ఖర్చు చేసైనా వ్యవస్థను మార్చాలనే వచ్చానన్నాడు. తన దగ్గర వేల కోట్లు, వందల కోట్లు ఆదాయం తెచ్చే ఫ్యాక్టరీలు లేవని, సినిమాలు చేసి పార్టీని పోషిస్తున్నానని తెలిపాడు.. ప్రభుత్వంలో లాబీయింగ్ చేసి కాంట్రాక్టులు ఇప్పించి డబ్బులు తీసుకుని జనసేన పార్టీని నడపడం లేదని పేర్కొన్నాడు.

 

ఆదివారం అమరావతిలోని పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యాడు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, స్థానిక సంస్థల ఎన్నికలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాడు. ఈ సందర్భంగా.. టీడీపీ, వైసీపీ డ్రామాలు ప్రజలకు తర్వలోనే అర్థమవుతాయని, అప్పుడు వారికి జనసేన, బీజేపీలు ఏకైక ఆప్షన్ గా కనిపిస్తాయన్నాడు. ప్రస్తుతం రూ. 2 వేలు ఇస్తేనే ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లే ట్రెండ్ నడుస్తోందని.. ప్రజల్లో ఆ ధోరణి మారాలన్నాడు. లేకుంటే మరో పదేళ్లలో రాష్ర్ట భవిష్యత్ నాశనం అయిపోతుందని హెచ్చరించాడు. ఏపీ భవిష్యత్తు కోసమే జనసేన బీజేపీతో కలిసామని, జగన్ కేసుల కోసం బీజేపీతో కలవాలని డ్రామాలు చేస్తున్నాడని ఆరోపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: