అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా భారత పర్యటనకు వస్తుండటంతో భారత ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్‌ ఎంతో గొప్పగా రిసీవ్‌ చేసుకున్నాడు. దీంతో భారత్‌ కూడా అదే స్థాయిలో ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24న భారత్‌ రానున్న నేపథ్యంలో గుజరాత్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు గడపనున్నారు. అందుకోసం విజయ్‌ రూపాణి సర్కార్‌ ఏకంగా రూ.100 కోట్లు వెచ్చిస్తోంది.


అహ్మదాబాద్‌ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థలు కలిసి ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 14 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు వేశారు, చాలా చోట్ల రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. ఈ మరమ్మత్తుల కోసం రూ. 80 కోట్లను కేటాయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ట్రంప్‌ భద్రత కోసమే రూ. 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది భారత ప్రభుత్వం. మోదీ, ట్రంప్‌ రోడ్‌ షో  జరిగే మార్గంలో మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకోసం మరో 4 కోట్లు ఖర్చు అవుతోంది.


రోడ్‌ షో  అనంతరం సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు. ఆ తరువాత మొతేరా ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తోన్న సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ స్టేడియంను ట్రంప్‌ తో కలిసి ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాంతం లో కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో స్టేడియం ప్రాంతంలో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.దాదాపు 10,000 మంది పోలీసు సిబ్బంది తో బందోబస్తును పర్యవేక్షించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: