సాధారణంగా నియోజవర్గంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా అధికార పార్టీకి చెందిన నాయకుల, కార్యకర్తల ఇంటి దగ్గరకు వెళ్లి ఆ సమస్యలను పరిష్కరించమని ప్రజలు కోరడం సాధారణంగా జరిగేదే. కానీ కొందరు నాయకులు, కార్యకర్తలు మాత్రం ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తెలియకుండానే కార్యకర్తలు ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. 
 
తాజాగా అధికార పార్టీ కార్యకర్త డబ్బులు డిమాండ్ చేయడం వలన వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. పూర్తి వివరాలలోకి వెళితే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం భీమ‌డోలు మండ‌లం పోలసానిపల్లిలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే పుష్పాల వాసుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలసానిపల్లి విధ్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా మశీదు వద్ద ఉన్న ప్లాట్లలో నివసిస్తున్న స్థానిక మహిళలు ఎమ్మెల్యే వాసుబాబును చుట్టుముట్టి వైసీపీ యూత్ నాయకుడు కాలనీలో రోడ్లు వేయమని కోరగా 10,000 రూపాయలు డిమాండ్ చేశాడని ఫిర్యాదు చేశారు. 
 
వైసీపీ యూత్ నాయకుడు జల్లా బాలు తాము నివశించే కాలనీ నాన్ లే అవుట్ ప్రదేశమని చెప్పి రోడ్డు వేయాలంటే ఇంటికి 10,000 రూపాయల చొప్పున డిమాండ్ చేస్తున్నారని గ్రామస్థులు ఎమ్మెల్యేకు చెప్పారు. అప్పటికీ గ్రామంలోని అందరూ కలిసి 40,000 రూపాయలు ఇస్తామని చెప్పామని కానీ ఒక్కొక్కరూ 10,000 రూపాయలు ఇస్తే మాత్రమే రోడ్డు వేస్తానని చెప్పారని గ్రామస్థులు ఎమ్మెల్యేకు బాలుపై ఫిర్యాదు చేశారు. 
 
గ్రామస్థులు ఫిర్యాదు చేసిన సమయంలో వైసీపీ నాయకుడు బాలు కూడా ఎమ్మెల్యే పక్కనే ఉన్నారు. ఎమ్మెల్యేకు తన గురించి ఫిర్యాదు చేయడంతో బాలు ఎమ్మెల్యే అక్కడ ఉన్నసమయంలోనే తనపై ఫిర్యాదు చేసిన వారిని బెదిరించాడు. గ్రామంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే వాసుబాబు గ్రామస్థులకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఆరోపణలతో శాసన సభ్యుడు వాసుబాబు అందరిముందు  చిన్నబుచ్చుకున్నట్లయింది.

.
 

మరింత సమాచారం తెలుసుకోండి: