సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ ఇంటర్ నెట్ ద్వారానే జరిగిపోతున్నాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. ఎన్ని లక్షలైనా కోట్లయినా.. ట్రాన్స్ ఫర్ చేసేయొచ్చు.. ఏ చెల్లింపులైనా చేయొచ్చు.. ఇందుకు కావాల్సింది నెట్ బ్యాంకింగ్ ఫెసిలటీ.. ఓ పాస్ వర్డ్. అంతే.. అయితే కొన్నిసార్లు ఇవే శాపంగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్లబారిన మన అకౌంట్ పడిందంటే.. ఇక అకౌంట్లో సొమ్ముకు కాళ్లొచ్చినట్టే.

 

సినీనటుడు బాలకృష్ణ భార్య వసుంధర విషయంలో ఇలాగే జరిగింది. బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఆమె పేరిట నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ తీసుకుని సొమ్ము కాజేయాలనుకున్న వ్యక్తి ప్లాన్ బ్యాంకు సిబ్బంది జాగ్రత్త కారణంగా రట్టయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బంజారాహిల్స్‌ శాఖలో బాలకృష్ణ సతీమణి వసుంధరకు అకౌంట్ ఉంది.

 

ఈనెల 13న ఆ బ్యాంకు రిలేషన్‌షిప్‌ మేనేజర్లు శ్రీనివాస్‌, ఫణీంద్ర బాలకృష్ణ అకౌంటెంట్‌ వెలిగల సుబ్బారావుకు ఫోన్‌ చేసి వసుంధర ఖాతాకు సంబంధించి మొబైల్‌ బ్యాంకింగ్‌ దరఖాస్తును యాక్టివేట్‌ చేయాలా? అని అడిగారు. దాంతో ఆయన షాక్ అయ్యారు. అసలు వసుంధర మొబైల్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తే చేయలేదు. దీంతో వారికి అనుమానం వచ్చేసింది. ఏం జరిగిందా అని ఆరా తీస్తే..దిమ్మతిరిగే షాకింగ్ విషయం బయటపడింది.

 

బాలకృష్ణ వద్ద కొత్తగా చేరిన జూనియర్‌ అకౌంటెంట్‌ కొర్రి శివ వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం దరఖాస్తు చేశాడట. బ్యాంకు సిబ్బంది ఫోన్ చేయబట్టి సరిపోయింది కానీ లేకపోతే.. ఆమె ఎకౌంట్‌ మొబైల్ బ్యాంకింగ్ పొందిన శివ ఏం చేయాలనుకున్నాడో.. ఆమె ఎకౌంట్ నుంచి ఎంత కొట్టేయాలనుకున్నాడో.. ? బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో శివపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించారు. అందుకే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ పాస్ వర్డ్ మార్చుకుంటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: