ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఈ కుల రాజకీయం మరీ ఎక్కువ. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి గెలుపు ఓటముల వరకూ కుల ప్రస్తావన లేకుండా సాగదు. అలాంటి కులరాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల గురించి పార్టీ కార్యకర్తలతో ముచ్చటించే సమయంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

ఏపీలో రాజకీయాలు రెండు కులాల మధ్య ఘర్షణలా తయారయ్యాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుల సంస్కృతి మారాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని పవన్‌ పిలుపునిచ్చారు. కుల రాజకీయాలు మారాలంటే సరికొత్త రాజకీయ వ్యవస్థ నెలకొల్పాలని, అది జనసేనతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని పవన్ అంటున్నారు.

 

 

కుల రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే తాను గతంలో రాజధాని కోసం 33వేల ఎకరాలు అవసరమా? అని నాడు ప్రశ్నించినట్లు పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. కక్ష సాధింపు రాజకీయాల వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారని చెప్పారు. జనసేనను బతికించింది సామాన్యుడేనని.. అలాంటి సామాన్యుడికి కవచంలా న్యాయవిభాగం పనిచేయాలని సూచించారు. న్యాయవాదుల నుంచి బలమైన నేతలు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

 

రాజకీయాలు తనకు రిటైర్మెంట్‌ ప్లాన్‌ కాదన్నారు పవన్ కల్యాణ్. ప్రజలకు సేవచేయాలని నిర్ణయించుకునే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్‌ తేల్చి చెప్పారు. పార్టీకి అండగా ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: