ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏం చెప్పిందో... అదే చేసుకుంటూ పోతోంది. ఇంటింటికీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. ఆయా జిల్లాల్లో నేతలు దీన్ని ప్రారంభించి... గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా... ప్రతీ ఇంటి తలుపు తట్టి రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే... ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు ఇవ్వబోతోంది. అలాగే... రేషన్ సరుకులు కూడా. ఇలా ఇళ్లకే తెచ్చి కార్డులు ఇస్తుండటంతో... లబ్దిదారులు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా లబ్దిదారుల ఇంటికి గ్రామ వాలంటీర్లు రాకపోతే... ఆందోళన చెందకుండా మరో వారం ఆగడం మంచిదే. ఎందుకంటే ప్రతి కార్డుపైనా తహశీల్దారు డిజిటల్‌ సంతకం తప్పనిసరి చేశారు.

 

అందుకే కాస్త ఆలస్యమవుతోంది. వారమైనా కార్డు తెచ్చి ఇవ్వకపోతే... అప్పుడు కాల్ చేసి... తమకు ఇంకా కొత్త రేషన్ కార్డు రాలేదని అడగవచ్చు. వెంటనే వాళ్లు అలర్టై... తెచ్చి ఇస్తారు. ఇది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరిగిందనీ, చాలా మంది అర్హులు కాని వాళ్లు తెల్ల రేషన్ కార్డులు కలిగి వున్నారని ఇప్పటి ప్రభుత్వం తేల్చింది. అనర్హుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇది ఓ పట్టాన తేలకపోవడంతో... ఇలా కాదని అనుకున్న ప్రభుత్వం తాజాగా కొత్తగా రేషన్ కార్డు లబ్దిదారుల్ని గుర్తించి, వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇస్తోంది. అందువల్ల లబ్దిదారులు కచ్చితంగా కొత్త రేషన్ కార్డుల్ని పొందాల్సిందే.

 

అప్పుడు మాత్రమే వారికి నెలవారీ ఉచిత రేషన్ సరుకులు లభిస్తాయి. ఏప్రిల్ 1 నుంచీ కొత్త రేషన్ కార్డులపై నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులు లేకపోతే... ఇతర పథకాలు అందవేమో అన్న డౌట్ కొంత మందికి ఉంటుంది. ఆ భయం అక్కర్లేదు. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, జగనన్న దీవెన, అమ్మఒడి వంటి పథకాలకూ, రేషన్ కార్డుకూ సంబంధం లేదు. ఆ పథకాలకు ఉండే రూల్సే ఆ పథకాలకు వర్తిస్తాయి. అందువల్ల అర్హులకు అన్యాయం జరగదనీ, ఆవేదన చెందవద్దని ప్రభుత్వం మరీ మరీ చెబుతోంది.ఓవైపు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న ప్రభుత్వం... మరోవైపు పాత అక్రమ రేషన్ కార్డుల్ని ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది.

 

అందువల్ల అనర్హులు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. ఒకవేళ చేసుకున్నా ప్రభుత్వం వారికి కొత్తవి ఇవ్వదు. ఎవరైనా నెలకు 300 యూనిట్లు కరెంటు వాడుతున్నట్లైతే... వారిని రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితా నుంచీ తొలగిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. వాటిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫొటోలతోపాటు, ప్రభుత్వం చిహ్నంతో వైసీపీ గుర్తులు ముద్రించారు. ఈ రేషన్ కార్డులు విజయవాడలో ప్రింటింగ్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరు కల్లా లబ్దిదారులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: