తెలుగుదేశం పార్టీలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన ఎంపిలపై జీవిఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫిరాయింపు ఎంపిలంటే కేవలం కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ టివి చర్చలో బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ టిడిపిలో నుండి తమ పార్టీలోకి చేరిన ఎంపిలకు ఇంకా పాత వాసనలు పోలేదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.

 

రెండోసారి నరేంద్రమోడి అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడే నలుగురు రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ ను బిజెపిలోకి పంపిన విషయం అందరికీ తెలిసిందే. తనపై ఎటువంటి కేసులు పడకుండా కేవలం తన రక్షణ కోసమే వాళ్ళని బిజెపిలోకి పంపినట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. సరే కారణాలు ఏవైనా సుజనా మినహా మిగిలిన ముగ్గురు ఎంపిలు మాత్రం రాష్ట్ర రాజకీయాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.

 

అయితే సుజనా మాత్రం చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అందులోను చంద్రబాబుకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ఈ విషయంపై పార్టీలో పెద్ద వివాదం కూడా నడుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు, ఇంగ్లీషు మీడియం, రివర్స్ టెండర్లు తదితర అంశాల్లో జగన్మోహన్  రెడ్డి ప్రభుత్వాన్ని సుజనా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. ఈ విషయంలో బిజెపి నేతల్లోనే కొందరు రూల్స్ గురించి మాట్లాడుతుంటే సుజనా లాంటి వాళ్ళు మాత్రం చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వ తదితరులు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

 

ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జీవిఎల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాత వాసనలు వదులుకుని బిజెపి ఆలోచనల ప్రకారమే నడుచుకోవాలంటూ హెచ్చరించారు.  తానొక్కడే అధికారప్రతినిధిగా కూడా జీవిఎల్ క్లారిటి ఇచ్చారు. సుజనా లాంటి ఎంపిలెవరూ అధికార ప్రతినిధులు కారు కాబట్టి వాళ్ళ మాటలను లెక్క చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పేశారు. మరి ఇప్పటికైనా సుజనా తన లైన్ మార్చుకుంటారా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: