రాజ్యసభలో మా మద్దతు మీకే. కావాలంటే 1, 2 సీట్లు ఇచ్చేస్తాం. కేంద్రానికి సీఎం జగన్‌ ప్రతిపాదన చేశారు.   కేసుల నుంచి వెసులుబాటుకు ఎత్తు అన్న విమర్శ సర్వత్రా వ్యతికమవుతుంది.  హైకోర్టు తరలింపు, మండలి రద్దు నిర్ణయాలపై ఆమోదముద్రకు పాట్లు.  అలవికాని కోర్కెలు అంగీకరించే అవకాశాల్లేవంటున్న  బీజేపీ వర్గాలు. కేంద్రంలో బీజేపీ, వైసీపీ మధ్య ఏం జరుగుతోంది? పొత్తు అవకాశాలపై మంత్రి బొత్స చేసిన పరోక్ష వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో సీఎం జగన్‌తో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జరిపిన చర్చలు ఏం సూచిస్తున్నాయి? ..ప్రస్తుతం రాజకీయ పరిశీలకులను వేధిస్తున్న ప్రశ్నలివి. 

 

ఏప్రిల్‌లో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైసీపీ సంఖ్యాబలం పెరగనుండటాన్ని అవకాశంగా తీసుకొని  కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు పొందాలని జగన్‌ భావిస్తున్నారన్నది వారి తాజా అంచనా. రాజ్యసభలో తమ సంఖ్యాబలం ఆరుకు పెరుగుతుందని, వీరంతా బీజేపీకి అండగా నిలబడతారని, అవసరమైతే కొత్తగా వచ్చి చేరే నాలుగులో కమలనాథుల కోసం ఒకటి, రెండు సీట్లు త్యాగం చేయడానికైనా సిద్ధమేనని ఆయన ప్రతిపాదించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్ల కోసం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీ్‌సతో భేటీ అయిన కొద్దిసేపటికే జగన్‌తో హోం మంత్రి అమిత్‌ షా చర్చలు జరపడం గమనార్హం. అయితే రాజ్యసభలో బలం పెంచుకునేందుకు వైసీపీ సహకారం తీసుకోవడం రాజకీయంగా తమకు ప్రయోజనం చేకూరుస్తుందా, లేదా అనే విషయమై పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

 

ఖాళీ అయ్యే 51 సీట్లలో బీజేపీ, కాంగ్రె్‌సకే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఈ పార్టీల సంఖ్యాబలం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి 18 సీట్లు ఖాళీ అవుతుండగా, ఆ పార్టీ నుంచి 13 మంది మాత్రమే మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ సభ్యులు 11 మంది రిటైర్‌ అవుతుండగా, తిరిగి 10 మందే ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అయిదుగురు, వైసీపీ నుంచి నలుగురు, బిజూ జనతాదళ్‌, టీఆర్‌ఎస్‌, ఆర్‌జేడీ, జేడీ(యూ), ఎన్‌సీపీల నుంచి ఇద్దరు చొప్పున, శివసేన, డీఎంకే, జేఎంఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నిక కానున్నారు. కాగా, సీబీఐ కోర్టులో తనపై పెరుగుతున్న ఒత్తిడి నుంచి వెసులుబాటు కల్పించడం, రాష్ట్రంలో తాను తీసుకున్న మండలి రద్దు, హైకోర్టు తరలింపు నిర్ణయాలకు వేగవంతంగా ఆమోద ముద్ర వేయడం వంటివాటితో పాటు ఆర్థిక చేయూత కోసం కేంద్రానికి జగన్‌ స్నేహహస్తం చాపారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

 

అందులో భాగంగానే రాజ్యసభలో పెరగనున్న తమ బలాన్ని ఫణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో అధిష్ఠానం ఆచితూచి స్పందిస్తుందని, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. బిజూ జనతాదళ్‌ తమకు కేంద్రంలో అండగా ఉన్నా కూడా ఒడిశాలో తాము రాజకీయంగా బలోపేతమయ్యే ప్రయత్నాలు మానుకోలేదని వివరించారు. ఇదే వైఖరి వైసీపీ విషయంలో కూడా అనుసరించే అవకాశాలు లేకపోలేదన్నారు. తమ అవసరాల రీత్యా ప్రాంతీయ పార్టీలు స్నేహహస్తం చాపడం సహజమేనని, వాటిని ఎంత మేరకు అనుమతించాలన్న విషయంలో మోదీ, షా తగిన నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేశారు. అలవికాని కోర్కెలను అంగీకరించే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నారు.

 

ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం రూ.55,549 కోట్లు కేంద్రం విడుదల చేసే అవకాశాలు లేవన్నారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన మొత్తానికే కట్టుబడి ఉంటామని, ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలకు నిధులు మంజూరు చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. మండలి రద్దు, హైకోర్టు తరలింపుపై వేగవంతమైన నిర్ణయాలు కూడా సాధ్యం కాకపోవచ్చని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: