రాజకీయ వైరాగ్యం అప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో కనిపిస్తోంది. ఏపీలో తనకున్న ఇమేజ్, సామాజిక వర్గం మద్దతు ఇవన్నీ రాజకీయాలు తనకు పెద్దగా ఉపయోగపడక పోవడం.. ఎన్నికల్లో ఒక్క సీటు సీటుకే పరిమితం కావడం, ఇవన్నీ పవన్ లో బాగా నిరాశ నిస్పృహలు అలుముకునేలా చేశాయి. ఇక ఐదేళ్ల పాటు పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లడం తన శక్తికి మించిన పని అనే అభిప్రాయానికి రావడంతోనే బీజేపీతో పొత్తుకోసం హడావిడిగా ఢిల్లీ వెళ్లి మరి పొత్తుప్రకటన చేశారు. ఇక బిజెపి అండదండలతో ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు.. అడుగడుగున జగన్ అడ్డుకోవచ్చని పవన్ కలలు కన్నారు. కానీ బీజేపీ మాత్రం పవన్ ఆశలను ఆదిలోనే నిరాశకు గురిచేసింది.


  పొత్తు పెట్టుకున్నామన్న సంతోషం కూడా పవన్ కు ఎంతో కాలం నిలవకుండా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తూ వస్తున్నారు. కనీసం అగ్రనేతల అపాయింట్మెంట్ కూడా పవన్ కు లభించకపోవడంతో చాలా నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఏపీ లో ప్రజా పోరాటాలు.. అమరావతి కి మద్దతుగా ఆందోళనలు చేద్దామని పవన్ ప్రతిపాదించినా బిజెపి మాత్రం మౌనంగానే ఉండిపోయింది. ఇదే సమయంలో జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇవ్వడం.. త్వరలోనే వైసీపీ ఎన్డీయే లో చేరుతుందని.. రెండు మూడు మంత్రి పదవులు కూడా ఆ పార్టీకి దక్కే అవకాశం ఉన్నట్లు గా వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ బీజేపీ తీరుపై విసుగెత్తి పోయారు. 


అందుకే ఆ పార్టీకి ఇక గుడ్ బాయ్ చెప్పి తన పాత మిత్రుడు చంద్రబాబు తో కలిసి ముందుకు వెళ్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న భావనలో పవన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇక అధికారికంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని తమ రెండు పార్టీలు కలిసి ప్రజా పోరాటాలు చేసి జగన్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బందిపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏపీకి సీఎం అవ్వాలని కలలు కంటున్న పవన్ టీడీపీతో జత కలిస్తే ఆ ఆశలు తీరుతాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పవన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఈ నాలుగేళ్లలో పార్టీ ఉనికి కాపాడుకోవడమే తన ఏకైక లక్ష్యం గా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: