ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన ఒక మహిళ గ్రామానికి తిరిగి వచ్చింది. మహిళ కనిపించకుండా పోయిన తరువాత ఆమె కుటుంబ సభ్యులందరూ మహిళ చనిపోయిందని భావించారు. కానీ రెండేళ్ల తరువాత మహిళ ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులందరూ తొలుత షాక్ అయినప్పటికీ ఆ తరువాత వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
పూర్తి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురానికి చెందిన 60 సంవత్సరాల వయస్సు గల అచ్చమ్మ రెండు సంవత్సరాల క్రితం భర్తతో గొడవ పడి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. అచ్చమ్మ కోసం ఆమె భర్త, ఇద్దరు కుమారులు వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కూడా అచ్చమ్మ కోసం వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు అచ్చమ్మ చనిపోయి ఉంటుందని భావించారు. 
 
ఏడు నెలల క్రితం అచ్చమ్మ భర్త అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కూడా చనిపోయిందనుకున్న అచ్చమ్మ రెండు రోజుల క్రితం గ్రామానికి తిరిగి వచ్చింది. రెండేళ్ల తరువాత అచ్చమ్మ తిరిగిరావడంతో అచ్చమ్మ కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. తన భర్త చనిపోయాడని తెలిసి అచ్చమ్మ బాధ పడింది. 
 
డబ్బుల విషయంలో తనకూ తన భర్తకు గొడవలు జరిగాయని అందువలన ఎవరికీ చెప్పకుండా ఇళ్లు వదిలి వెళ్లిపోయానని అచ్చమ్మ కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు చెప్పింది. కర్నూలులో విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ రఘురామిరెడ్డి తనకు ఆశ్రయం ఇచ్చారని తనను సొంత తల్లిలా చూసుకున్నారని అచ్చమ్మ చెప్పింది. అచ్చమ్మ ఇంటికి తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: