ఇప్పటికే లోక్ సభ లో ఏమాత్రం బలం లేక ఇబ్బంది పడుతున్న విపక్షాలకు ఇప్పుడు మరింత ఇబ్బందికర వాతావరణం ఎదురు కానుంది. పెద్దల సభ అయిన రాజ్యసభలో విపక్షాల బలం మరింతగా తగ్గిపోతుంది. ఇన్నాళ్ళు కీలక బిల్లుల విషయంలో పెద్దల సభలో ఇబ్బంది పడుతున్న అధికార ఎన్డియేకి ఇప్పుడు ఈ పరిణామం మరింతగా కలిసి రానుంది. ఈ ఏడాదిలో పలు దఫాలుగా రాజ్యసభలో సీట్లు కాళీ కానున్నాయి. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలకు గానూ ఈ ఏడాది మొత్తం 68 సీట్లు ఖాళీ అవుతున్నాయి. 

 

ఏప్రిల్‌ నెలలో 51 స్థానాలు, జూన్‌ లో 5, జులైలో 1, నవంబర్‌లో 11 స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిల్లో 19 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి పోతాయి. అయితే కాంగ్రెస్ కి ఇక్కడ మరో అవకాశం ఉంది. మిత్ర పక్షాల సహకారంతో 10 స్థానాలు గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో ఆ పార్టీ అధికారంలో ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా కీలక నేతలను రాజ్యసభకు పంపించే యోచన కాంగ్రెస్ చేస్తుంది. 

 

ప్రస్తుతం రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి 82 మంది సభ్యుల బలం ఉండగా కాంగ్రెస్ పార్టీకి 46 మంది సభ్యుల బలం ఉంది. బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.  చేసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అభ్యర్థులను గెలిపించుకుని బలం పెంచుకోనుంది. పెద్దల సభలో ఇప్పుడు బిజెపికి బలం చాలా అవసరం కావడంతో ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకునే ప్రయత్నం బిజెపి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సహకారంతో ముందుకి వెళ్ళే ఆలోచన చేస్తుంది. ఈసారి ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింథియా, రణ్‌దీప్‌ సుర్జేవాలాలను కాంగ్రెస్ రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి ప్రియాంక రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: