చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో ఉన్న నందనవన్ జంగల్ సఫారీలో ఒళ్ళు గగుర్పొడిచే ఒక సంఘటన చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకుంటే... నందనవన్ జంగిల్ లో శుక్రవారం రోజు ఒక టూరిస్ట్ బస్సు లో ప్రయాణిస్తున్న పర్యటకులకు రెండు పులులు ఆడుకుంటూ లేదా సరదాగా పోట్లాడుకుంటూ కనిపించాయి. దీంతో ఆ సన్నివేశాన్ని చూడాలని పర్యాటకులు కోరగా డ్రైవర్ బస్సుని చాలా నెమ్మదిగా నడపడం ప్రారంభించాడు. 

 


ఈ సందర్భంలోనే ఒక టూరిస్టు... బస్సు కిటికీ నుండి ఒక పరదాను వాటిపై విసిరేశాడు. దాంతో అక్కడున్న ఒక పులికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే బస్సు వైపు వేగంగా రావటం మొదలెట్టింది. ఇది చూసి భయబ్రాంతులకు గురి అయిన పర్యటకులంతా బస్సుని వేగంగా నడపమని డ్రైవర్ తో అన్నారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే గేర్లు మారుస్తూ బస్సుని వేగంగా నడిపాడు. అయినా కూడా ఆ పులి మాత్రం శరవేగంగా దూసుకొస్తూ బస్సుని వెంటాడింది. అయితే అదృష్టవశాత్తు ఆ పులి కొంత దూరం వరకు వచ్చి ఆగిపోయింది. కానీ వెంటాడుతున్నంత సేపు బస్సులోని వారికి చెమటలు పట్టేసాయి. పులి ఎప్పుడైతే ఆగిపోయిందో ఆ మరుసటి క్షణమే బస్సులోని వారంతా ఊపిరిపీల్చుకున్నారు. 

 

 

అయితే, పులి వేటాడుతున్నప్పుడు చోటు చేసుకున్న భయానక దృశ్యాలను టూరిస్టు గైడ్ రికార్డు చేసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ కావడం... ఆ జంగిల్ సఫారీ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో బస్సు డ్రైవర్ అయిన ఓం ప్రకాష్ భారతిని, టూరిస్టు గైడు అయిన నవీన్ పూరైనాను వారి విధుల నుండి సఫారి డైరెక్టర్ ఎం మెర్సీ బెల్లా తొలగించారు. అలాగే సేఫ్టీ ప్రోటోకాల్ ను విస్మరించిన విషయంపై విచారణ చేయాలని ఆదేశం ఇచ్చారు. ఏదేమైనా ఒకవేళ పులి బస్సుని అలాగే వెంబడించి పర్యాటకులపై దాడి చేసినట్లు అయితే ఈ సంఘటన తీవ్ర విషాదంతో ముగిసేది. అందుకే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఉన్నత అధికారులు బాగా సీరియస్ అయ్యారని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: