ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థులకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించటం కొరకు జగన్ 30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిలో అధికారులతో ఐటీ పాలసీ, నైపుణ్యాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో అత్యత్తమ స్థాయిలో 30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. నాడు నేడు కార్యక్రమం కింద ఐటీఐ కాలేజీలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 కేంద్రాలను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. 
 
మిగిలిన 5 కేంద్రాలలో 4 కేంద్రాలను ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా ఏర్పాటు చేయాలని, పులివెందుల జేఎన్టీయూకు అనుబంధంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక కేంద్రీకృత వ్యవస్థను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పర్యవేక్షణ కొరకు కేటాయించాలని సీఎం అధికారులకు చెప్పారు. ఐటీ రంగం కొరకు విశాఖలో హై ఎండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు జగన్ తెలిపారు. 
 
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు సంబంధించి 45 రోజులలోపు భూములను గుర్తించటంతో పాటు ఆర్థిక వనరుల సమీకరణ కూడా పూర్తి కావాలని జగన్ అధికారులకు సూచనలు చేశారని తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకునే అవకాశం కల్పించి పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. 
 
ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలను నిర్వహించటంతో పాటు ఎంఎన్‌సీడ్రైవ్‌, స్కిల్ కనెక్ట్ ద్వారా యువతకు ప్రభుత్వం ఉపాధి కల్పించనుంది. విద్యార్థులు, యువత కొన్నిసార్లు అర్హతలు ఉన్నా నైపుణ్యాలు లేక ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవడంలో చతికిలపడుతున్నారు. సీఎం జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: