అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రాకకు భారతదేశం ఆతృతగా ఎదురుచూస్తోంది. అగ్రరాజ్య అధినేతకు ఘనమైన ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు భారత్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అహ్మదాబాద్, ఢిల్లీల్లో రెండ్రోజులపాటు పర్యటించనున్న ట్రంప్ దంపతులకు ఈ టూర్‌ను మరచిపోలేని విధంగా చేసేందుకు భారత్‌ అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఒక్క అహ్మదాబాద్‌లోనే 3 గంటల టూర్‌కోసం వందకోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 24వ తేదీన భారత్ వస్తున్నారు. అహ్మదాబాద్, ఢిల్లీలలో పర్యటించనున్న ట్రంప్‌ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌ను మరపురాని మధురానిభూతిని మిగిల్చేందుకు మోదీ సర్కార్‌ ఘనమైన ఆతిథ్యానికి సిద్ధమైంది. 

 

గతేడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ హౌడీ మోడీ ఈవెంట్ జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'హౌడీ మోదీ' తరహాలోనే ఇప్పుడు అహ్మాదాబాద్ ఈవెంట్ కూడా జరగబోతోంది. దీనికి ముందు 'కెమ్‌ చో ట్రంప్'  అని పేరు పెట్టారు. గుజరాతీలో కెమ్ చో అంటే ఎలా ఉన్నారని అర్థం.. అగ్రరాజ్యాధినేత వస్తే ప్రాంతీయ భాషలో ఈవెంట్ పేరు పెట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ట్రంప్‌ టూర్‌ను ప్రాంతానికే పరిమితం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కార్యక్రమం పేరు మార్చాలని కేంద్రం గుజరాత్‌ సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సల్‌గా ఉండేలా 'నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్‌' అని ఈవెంట్‌ పేరు పెట్టాలని సూచించింది.

 

అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి సబర్మతి ఆశ్రమం మీదుగా మోతేరా స్టేడియం వరకూ సాగనున్న ట్రంప్‌ ర్యాలీకోసం గుజరాత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.  మొత్తం 22 కిలోమీటర్లు సాగే రోడ్‌షో ట్రంప్‌ టూర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. వంద కోట్ల రూపాయలతో రహదారులను సిద్ధం చేస్తోంది. పేదరికం ఆనవాళ్లు  కనపడకుండా స్లమ్ ఏరియాలను కవర్ చేస్తూ గోడను  నిర్మిస్తోంది. దారిపొడవునా సాంస్కృతిక కార్యక్రమాలకోసం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ట్రంప్‌ భద్రత కోసమే 15 కోట్ల దాకా ఖర్చుచేయనున్నారు.

 

 అహ్మదాబాద్‌ నగరపాలక సంస్థతో పాటు అహ్మదాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ట్రంప్ టూర్ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 14 కోట్లను అందించనుంది. ట్రంప్‌తో పాటు మోదీ రోడ్‌ షోలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం సం 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ భద్రతా దళం-NSG స్నైపర్‌ బలగాలు కార్యక్రమం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. భారతీయ భద్రతా దళాలతో పాటు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం కూడా నిఘాలో పాలుపంచుకోనున్నాయి. 

 

ట్రంప్ టూర్ నేపథ్యంలో జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి చేస్తామంటూ హెచ్చరికలు జారీచేసింది. ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఓ వీడియోను విడుదల చేసింది. హంతకులను క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశారు.

 

అహ్మదాబాద్‌లో మూడు గంటలపాటు గడపనున్న ట్రంప్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎయిర్‌పోర్ట్ లో ట్రంప్ దంపతులకు సైనిక బలగాలు గౌరవ వందనం సమర్పిస్తాయి. అక్కడి నుంచి మొదట సబర్మతి ఆలయానికి ట్రంప్ దంపతులు చేరుకుంటారు. సబర్మతి ఆశ్రమం విశిష్టతను ప్రధాని మోదీ, ట్రంప్ దంపతులకు వివరిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన సర్దార్ వల్లభాయ్ స్టేడియంను మోతేరాలో ట్రంప్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష 20 వేల మంది పాల్గొంటారని అంచనా. ప్రభుత్వం ఇప్పటికే వీరందరికి ప్రత్యేక ఆహ్వానాలు పంపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: