ఎవరైనా బాలికలు ఒంటరిగా కనిపిస్తే వారిపై లైంగిక దాడులు చేసే ఈ భయంకరమైన సమాజంలోకి ఇద్దరు స్కూల్ విద్యార్థినులు టెలివిజన్ తారలు కావాలని ఆశతో ముంబై మహానగరంలో అడుగుపెట్టారు. ఆ తరువాత వారికి ఏమైందో మనం తెలుసుకుందాం.



అది ఫిబ్రవరి 11వ తారీఖు, బెంగళూరులో నివసిస్తున్న ప్రతీక్ష, తన స్నేహితురాలైన ఆయేషాలిద్దరు ఆర్.టీ నగరులోని తమ పాఠశాలకి వెళ్లారు. క్లాసులు జరుగుతుండగా 'ఈరోజు సాయంత్రం ముంబై వెళ్లి టీవీ యాక్ట్రెస్స్ అయిపోదాం. నేనొక మంచి ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి తెలుసుకున్న. మనం అక్కడికి వెళ్ళిపోయి ఆడిషన్ ఇచ్చేదాం.' అని ఆయేషా ప్రతీక్షతో అన్నది. స్కూల్ అయిపోగానే వీళ్ళిద్దరూ కలిసి ఆయేషా వాళ్ళ ఇంటికి వెళ్లారు. తరువాత తమ స్కూల్ యూనిఫామ్ మార్చుకుని బుర్కా వేసుకొని ఇంటి టెర్రస్ పైకి ఎక్కి పక్కనున్న ఇంటిపైకి దూకి మెట్లు దిగి బెంగుళూరు రైల్వేస్టేషనికి వెళ్లిపోయారు. స్టేషనులో ఆగివున్న లోకమాన్య తిలక్ ఎక్సప్రెసులోని జనరల్ భోగి ఎక్కి ముంబై రైల్వే స్టేషనుకు చేరుకున్నారు.



తరువాత ముంబై రైల్వేస్టేషన్ నుండి కొంచెం దూరం వచ్చి ఆటోస్టాండులో వెయిట్ చేస్తున్న డ్రైవర్ యాదవ్(28)ను అంధేరి వెస్ట్ లో ఉన్న ప్రొడక్షన్ హౌజుకి వెళ్లాలని అడిగారు. దాంతో యాదవ్ వాళ్ళిద్దరిని తన ఆటోలో ఎక్కించుకొని ప్రొడక్షన్ హౌజ్ వద్ద దింపాడు. కానీ అక్కడున్న సెక్యూరిటీ గార్డు వీళ్ళని లోపలకి రానివ్వలేదు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వచ్చామని చెప్పినా అక్కడ ఏ ఇంటర్వ్యూ జరగట్లేదని, కావాలంటే రెస్యూమ్ ఇచ్చి పొమ్మని గార్డ్ వాళ్ళకి చెప్పశాడు. దాంతో ఏం చేయాలో తెలియక వాళ్లు తెగ టెన్షన్ పడటం మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్న ఆటోడ్రైవర్ మాట్లాడుతూ 'మీ ఇంటికి తీసుకెళ్తా. రెస్యూమ్ తీసుకొని మళ్లీ రావొచ్చు', అని అన్నాడు. కానీ వాళ్లు బిక్కమొహం వేసి ప్రొడక్షన్ హౌసులోని వారికి ఫోన్ చేస్తామని యాదవ్ నుండి ఫోన్ తీసుకున్నారు. కానీ ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు.





దీంతో వారి మొహాల్లో తేడాని యాదవ్ గమనించాడు. మీ విషయం ఏంటి మీరు నిజం చెప్తారా లేకపోతే పోలీస్ స్టేషనుకు తీసుకెళ్ళమంటారా అని యాదవ్ ప్రశ్నించేసరికి వారు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. దాంతో వారిని ఏడవద్దని యాదవ్ చెప్పి నిజాన్ని రాబట్టాడు. తర్వాత వారిని సీసీ కెమెరాలు ఉన్న ఆటోస్టాండ్ ఆఫీసులో కూర్చోబెట్టి అతని స్నేహితుడైన గులాబ్ గుప్త(44)ని కలిశాడు. వాళ్ళిద్దరూ కలిసి బెంగళూరు వెళ్లే ట్రైన్ టికెట్లను, ఫుడ్ ని కొనుక్కొని వాటిని అమ్మాయిలకు ఇచ్చారు. అమ్మాయిలు భోజనం చేసిన తరువాత వారిని ముంబై రైల్వేస్టేషనుకు సురక్షితంగా తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించారు.

 



మరోవైపు తమ బిడ్డలు తప్పిపోయారని ప్రతీక్ష, ఆయేషా తల్లిదండ్రులు బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిబ్రవరి 14న ఉదయం పూట ఇంటికి చేరిన ప్రతీక్ష, ఆయేషాలు తాము ముంబై వెళ్లామని అక్కడ ఒక ఆటోడ్రైవర్ సహాయం చేశాడని తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఆటోడ్రైవరును దేవుడిగా భావించిన తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి ఈ ఇద్దరు అమ్మాయిలు రైల్వేటికెట్ కూడా కొనకుండా చేతిలో కనీసం రూ.1000 లేకుండా ముంబై నగరానికి వెళ్లి బుల్లితెర హీరోయిన్స్ అవ్వాలనుకున్నారు. వాళ్లు అనుకున్నది ఏమి జరగలేదు కానీ యాదవ్ లాంటి హీరోని కలిసి తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకున్నారు. ఆటో చార్జీలు ఖర్చు(700), ఫుడ్ ఖర్చు(200), టికెట్ల ఖర్చు(500) మొత్తం కలిపి రూ.1400లను తన చేతి నుండి ఇచ్చి అమ్మాయిలిద్దరిని రక్షించిన యాదవ్ ను నెటిజనులు బాగా కొనియాడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: