రాజకీయం అంటే రాజీ..కీయమే. ప్రజలను ఏదో ఉద్ధరిస్తారని జనాలు నాయకులను నమ్ముతుంటే నాయకులు మాత్రం తమ స్వలాభం చూసుకుంటూ ప్రజలను నమ్మించి మోసం చేసేందుకు కూడా వెనకాడడంలేదు. ఒకప్పటి రాజకీయాలు వేరు. ప్రజలకు ఏదో చేద్దాం అన్న తపన, ఆకాంక్ష ఉన్నవారు ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చేవారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చేందుకు డబ్బు ఏమాత్రం ప్రభావం చూపించేది కాదు. కేవలం ప్రజల్లో ఉన్న పలుకుబడే నాయకులుగా
ఎదిగేందుకు దోహదం చేసేది. అయితే ప్రస్తుత రాజకీయాలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి. డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. 


రాజకీయాల్లోకి వచ్చి ఎంత సంపాదించుకున్నాం...  తమ వారికి ఎంత సంపాదించి పెట్టాం అన్నట్టుగానే నాయకుల వ్యవహారం నడుస్తోంది. ఒక పార్టీతో మరో పార్టీ పొత్తు పెట్టుకున్నా.. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నా అంతిమంగా వారి స్వలాభం కోసమే అన్నట్టుగా నేటి రాజకీయాలు సాగుతున్నాయి. రాజకీయానికి మన నాయకులు అర్ధాలే మార్చేశారు. రాజకీయమంటే ప్రజాసేవ కాదని,ప్రజలే నాయకులకు చేయాల్సిన సేవ అన్నట్టుగా ప్రస్తుతం వ్యవహారాలు నడుస్తున్నాయి. 


ప్రస్తుతం మన ఏపీ రాజకీయాలు చూసుకుంటే ...మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీల కంటే కాస్త భిన్నంగానే రాజకీయ వ్యవహారాలు నడిపిస్తోంది అన్న పేరు సంపాదించుకుంది. వైసీపీని జగన్ స్థాపించిన తరువాత ఆ పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద అనేక విమర్శలు వచ్చినా .. ఈ ఎన్నికలకు ముందు మాత్రం పాదయాత్ర పేరుతో జగన్ జనాల్లోకి తిరగడం, ప్రజల అవసరాలు తెలుసుకోవడంతో తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడ అవినీతి వ్యవహారాలు చోటుచేసుకోకుండా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. 


 ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేదలకు పార్టీలకతీతంగా అందాలి అన్నట్లుగా పరిపాలన సాగిస్తున్నారు. జగన్ కు ఇవన్నీ పేరు తీసుకు రావడంతో ఆయనపై బురద చల్లేందుకు ఏపీలోని వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీలు పైకి వేరు వేరుగా రాజకీయాలు చేస్తున్నా లోలోపల మాత్రం ఈ రెండు పార్టీల అధ్యక్షులకు ఒక అండర్ స్టాండింగ్ ఉంది అనేది అందరికి తెలిసిందే. చాలాకాలంగా ఈ రెండు పార్టీలు లాలూచీ రాజకీయాలు చేస్తూనే వస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా ఏపీలో అనేక అక్రమాలకు, అవినీతికి పాలపడినట్టుగా అవినీతి ఆధారాలు బయటపడుతున్నాయి. అయినా నిస్సుగ్గుగా బుకాయింపులు చేస్తూ నేటి రాజకీయాల్లో ఇదంతా కామన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 


గత టీడీపీ ప్రభుత్వంలో పార్టీ నాయకులు పూర్తిగా అవినీతి వ్యవహారాల్లో మునిగి పోయి పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నా చంద్రబాబు దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించలేదు. అప్పటి ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతుల్లో మునిగిపోయిన ప్రశ్నిస్తాను  అంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ సైతం మూగనోము ఆచరించారు. టిడిపి ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిని గురించి గాని, నాయకుల వ్యవహార శైలిపై గాని పవన్ ఎక్కడ నోరు మెదిపేందుకు సాహసించ లేదు. టిడిపి జనసేన పార్టీల వ్యవహారం అందరికీ తెలిసిందే కాబట్టి ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. కొత్తగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలు పెట్టారు. దీంతో పవన్ మరింతగా జనాల విశ్వాసం కోల్పోయారు.


ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీలో టీడీపీ పని అయిపోతుంది అనుకుంటున్న సమయంలో రాజకీయంగా బలపడితే వచ్చే ఎన్నికల నాటికీ అధికారం దక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో జనసేనను చేరదీసి పొత్తు పెట్టుకుంది బీజీపీ. పొత్తు పెట్టుకున్న మొదట్లోనే బిజెపి కి పవన్ వ్యవహారశైలి అర్థం అయింది. అందుకే పొత్తు పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే ఆయన్ను పక్కన పెట్టేసింది. పవన్ కంటే జగన్ బెటర్ అన్న లెక్కలు బయటకి రావడంతో జగన్ తో సాన్నిహిత్యం పెంచుకుంది. మీరు అడిగినవన్నీ చేస్తాము. ఏపీకి ఏ అవసరం వచ్చినా ఆడుకుంటాము అంటూ వైసీపీతో స్నేహం కోసం ప్రాకులాడుతున్నారు. 


ఇక ఏపీ అవసర దృష్ట్యా, తాను ప్రవేశపెట్టిన పథకాల దృష్ట్యా కేంద్రం సహకారం తప్పనిసరవ్వడంతో జగన్ కూడా ఒకే చెప్పేసారు. బీజేపీ ఇప్పటికిప్పుడు జగన్ కు దగ్గరవ్వడం వెనుక కూడా కారణాలు లేకపోలేదు. త్వరలో బీజేపీకి రాజ్యసభలో మరికొన్ని స్థానాలు పెరుగుతుండడంతో బీజేపీ వైసీపీ స్నేహాన్ని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెటాకులయ్యేలా కనిపిస్తుండడంతో పవన్ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరికి వారు విలువలు, విశ్వసనీయత అన్నీ మర్చిపోయి అవకాశవాద రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఆ పార్టీపార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల లాలూచి వ్యవహారాలు, పొత్తులు, అవకాశవాదం, అవినీతి, ఇలా అన్నిరకాలుగా అందరూ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తూ నేటి రాజకీయాలు ఇంతేనోయ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: