ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గత వారం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసి సీఆర్డీఏ చట్టం రద్దు, శాసన మండలి రద్దు, మూడు రాజధానుల బిల్లు ఇతర అంశాల గురించి చర్చించిన విషయం తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో సీఎం జగన్ ఢిల్లీలో మోదీ, అమిత్ షా ను కలవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తెగ టెన్షన్ పడ్డారు. తాజాగా చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. 
 
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను ఢిల్లీకి పంపి శాసన మండలి రద్దు, సీఆర్డీఏ చట్టం రద్దు ఆమోదం పొందకుండా చంద్రబాబు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన ఖాయమైంది. రేపు టీడీపీ పార్టీ ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితుల గురించి వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
రెండు రోజులపాటు టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీలోనే మకాం వేసి ప్రధానంగా సీఆర్డీఏ చట్టం రద్దు, శాసన మండలి రద్దు, మూడు రాజధానుల అంశం గురించి మోదీ, అమిత్ షా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలతో చర్చించనున్నారు. రాజధానిని అమరావతి నుండి తరలిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వలన రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనల గురించి మరియు రాజధాని ఉద్యమం గురించి కేంద్రం దృష్టికి టీడీపీ ఎమ్మెల్సీలు తీసుకెళ్లనున్నారని సమాచారం. 
 
టీడీపీ ఎమ్మెల్సీల పర్యటన ద్వారా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో శాసన మండలి బిల్లుకు ఆమోదం రాకుండా ఆపాలని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ మోదీ, అమిత్ షాను కలిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఢిల్లీ బాట పట్టడంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: