గత కొన్ని రోజులుగా ఏపీలో పొత్తులు గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారో..అప్పటి నుంచి పొత్తులు వార్తలు బయటకొచ్చాయి. ఇంకేముంది బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది కాబట్టి, వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని, ఇటు రాష్ట్ర అవసరాల కోసం వైసీపీ కూడా బీజేపీతో ముందుకెళుతుందని ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది. అలాగే వైసీపీ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్ బెర్త్‌లు కూడా ఖాయమంటూ వార్తలు హల్చల్ చేశాయి.

 

అయితే ఈ వార్తలు జనసేనకు పూర్తిగా ఇబ్బందిగా మారాయి. మొన్న ఎన్నికల్లో చావుదెబ్బ తిని, ఏదొకవిధంగా పార్టీని నడిపించుకుని వెళ్లాలంటే బీజేపీ అండ ఉండాలనే ఉద్దేశంతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఇక వీరు పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ప్రణాళికలు రెడీ చేసుకుని పోరాటాలు చేస్తున్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల్లో కూడా ముందుకు వెళ్లాలని అనుకున్నారు. ఇక ఇప్పటికే నుంచి కష్టపడితే 2024 ఎన్నికలకు స్ట్రాంగ్‌గా అవొచ్చని ప్లాన్ చేశారు.

 

కానీ ఊహించని విధంగా బీజేపీ-వైసీపీతో పొత్తు పెట్టుకొనుందని ప్రచారం జరగడం జనసేనకు ఇబ్బందికరంగా మారింది. కాకపోతే ఈ పొత్తు కేవలం వార్తల్లోనే ఉందని, ఇది నిజం కాదని అర్ధమైపోయింది. అసలు వైసీపీతో బీజేపీ పొత్తు ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషుకులు తేల్చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో బీజేపీ ఎదగాలంటే వైసీపీతో పొత్తు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఒక బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో, 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలిసింది. బీజేపీకి ఎక్కువ సీట్లలోనే పోటీ చేసే అవకాశమే దక్కదు. దాని వల్ల రాష్ట్రం మొత్తం మీద బలపడాలంటే కష్టమైన పని.

 

ఇక టీడీపీ కంటే అత్యంత బలంగా ఉన్న వైసీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి పావలా ఉపయోగం ఉండదు. అదే తనకంటే కొంచెం బలం ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకు చాలా ఉపయోగం. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాపు సామాజికవర్గం ఓటు బ్యాంక్ జనసేనకు కాస్త ఎక్కువగానే ఉంది. పైగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తుపెట్టుకుంటే వైసీపీకి మైనారిటీ ఓట్లు దూరమవుతాయి. కాబట్టి ఏదో కేంద్రంలో ఎంపీల సాయం తీసుకుంటారు తప్ప, బీజేపీ-వైసీపీతో కలిసి ముందుకెళ్లే ప్రసక్తే లేదు. ఇంకా జనసేన-బీజేపీ మైత్రి కొనసాగుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: