కేంద్రీయ విద్యాల‌యం స‌మ‌గ్రాభివృద్ధికి తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నాదెండ్ల మండ‌లం గ‌ణ‌ప‌వ‌రం గ్రామంలో ఈ ఏడాది నుంచి మొద‌లైన కేంద్రీయ విద్యాల‌యాన్ని శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని సోమ‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిల‌క‌లూరిపేట నియోజ‌కవ‌ర్గానికి త‌న హ‌యాంలో కేంద్రీయ విద్యాల‌యాన్ని మంజూరు చేయించుకోవ‌డం త‌న‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన మూడు నెల‌ల్లోనే ఈ విద్యాల‌యాన్ని ఏర్పాటు చేయించుకోగ‌లిగామ‌ని చెప్పారు. నాదెండ్ల మండ‌లం ఇర్ల‌పాడు గ్రామంలో, 7 ఎక‌రాల విశాల స్థ‌లంలో కేంద్రీయ విద్యాల‌య శాశ్వ‌త భ‌వ‌నాల‌ను త్వ‌ర‌లోనే నిర్మించ‌బోతున్నార‌ని వెల్ల‌డించారు.

 

ఈ పాఠ‌శాల అభివృద్ధికి త‌న వంతు సాయం ఎప్పుడూ ఉంటుంద‌ని చెప్పారు. ఇర్ల‌పాడు స్థ‌లం స‌మ‌స్య లేకుండా చేసేందుకు త‌హ‌శీల్దార్‌, ఆర్డీవో, సీసీఎల్ అధికారులతో తాను నిరంత‌రం మాట్లాడిన విష‌యాన్ని గుర్తుచేసుకున్నారు. స్థ‌లం మంజూరుకాగానే కేంద్ర ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ను మ‌న పేట‌కు మంజూరుచేసింద‌న్నారు. నాణ్య‌మైన చ‌దువులు అందించే కేంద్రీయ విద్యాల‌యం మన ప్రాంతంలో ఉండ‌టం చిల‌క‌లూరిపేట ప్ర‌జ‌లు చేసుకున్న అదృష్ట‌మ‌ని చెప్పారు. ఎమ్మెల్యే చొర‌వ‌తో కేంద్రీయ విద్యాల‌యం.


సీఆర్ క‌ళాశాల‌ల అధినేత చుండి విజ‌య‌సార‌థి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన అన‌తి కాలంలోనే విడ‌ద‌ల ర‌జిని ఈ ప్రాంతానికి కేంద్రీయ విద్యాల‌యాన్ని తీసుకురాగ‌లిగార‌ని ప్ర‌శంసించారు. భూ స‌మ‌స్యను ప‌రిష్క‌రించాల్సిందిగా తాము ఆమెను కోరిన వెంట‌నే చొర‌వ‌తీసుకుని అధికారుల‌తో మాట్లాడార‌ని గుర్తుచేశారు. మాట‌లు కాదు.. చేత‌ల ఎమ్మెల్యేగా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని నిరూపించుకుంటున్నార‌ని కొనియాడారు.

అనంత‌రం ఎమ్మెల్యేను పాఠ‌శాల సిబ్బ‌ది స‌న్మానించారు. పాఠ‌శాల ప్రిన్సిప‌ల్ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వాటిని ప‌రిష్క‌రిస్తాన‌ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో ఇర్ల‌పాడు కేంద్రీయ విద్యాల‌యం కోసం కృషి చేసిన సీనియ‌ర్ ర‌సాయ‌న‌శాస్త్ర అధ్యాప‌కుడు ఆంజినేయులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠ‌శాల సిబ్బంది పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: