తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ  వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ నివాసం పై జరిగిన ఐటీ దాడుల్లో దొరికిన మొత్తం ఎంత అన్నదానిపై అధికార , ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది . శ్రీనివాస్ వద్ద రెండు వేలకోట్ల రూపాయలు దొరికినట్లు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు , మంత్రులు ఆరోపిస్తుండగా , అసలు ఆయన ఇంట్లో  దొరికింది కేవలం రెండు లక్షల రూపాయలు , కాసింత బంగారం మాత్రమేనని టీడీపీ నేతలు వాదిస్తున్నారు .

 

ఈ మేరకు ఐటీ శాఖ విడుదల చేసిన  పంచనామా  పత్రాన్ని చూపిస్తూ , శ్రీనివాస్ ఇంట్లో వైస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు దొరికింది రెండు వేలకోట్ల రూపాయలు కాదు ... కేవలం రెండు లక్షలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు . అయితే ఐటీ శాఖ ఇచ్చిన ప్రకటన లో రెండువేల కోట్ల రూపాయలు దొరికినట్లు పేర్కొనడం జరిగిందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు .   రెండువేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఐటీ శాఖ ఇచ్చిన ప్రకటన లో నిజం లేదని చెబుతున్న టీడీపీ నేతలు ,   దమ్ముంటే ఐటీ శాఖపై పరువునష్టం దావా వేయాలంటూ ఆయన  సలహానిచ్చారు  . తన మాజీ  వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిగిన ఐటీ  దాడులపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు . చంద్రబాబు ఎందుకు మీడియా ముఖం చాటేశారో చెప్పాలన్నారు . 

 

 శ్రీనివాస్ తమకు సంబంధం లేదన్న టీడీపీ నేతలు ఇప్పుడెందుకు ఆయన  ఇంట్లో కేవలం రెండు లక్షలు మాత్రమే దొరికాయని పేర్కొంటున్నారో చెప్పాలని వైస్సార్ కాంగ్రెస్  నేతలు  ప్రశ్నిస్తున్నారు . శ్రీనివాస్ ఇంట్లో దొరికింది కేవలం రెండు లక్షలైతే ...  వైస్సార్ కాంగ్రెస్ పనిగట్టుకుని , తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: