ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పెడుతున్న ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలకు సర్వత్రా ఆమోదం లభిస్తోంది. 45 వేలకు పైగా పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలు ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా స్వాగతించాయి. మరోవైపు ఇంగ్లీష్‌ మీడియంకోసం పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సులను అందించనుంది.

 

వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తల్లిదండ్రుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ప్రభుత్వ నిర్ణయానికి 45వేలకు పైగా పాఠశాలల పేరెంట్స్ కమిటీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు పేరెంట్స్ కమిటీలు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సచివాలయంలో మీడియా ముందు ప్రదర్శించారు.

 

 ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని మొదట ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యతిరేకించి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోని 140 స్కూళ్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్మానం చేసి పంపించాయని ఆయన వెల్లడించారు. దీన్నిబట్టి ప్రభుత్వ నిర్ణయానికి ఏ స్థాయిలో మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

 

ప్రైవేటు విద్యాసంస్థలకు సమానంగా ఇంగ్లీష్‌ మీడియంలో విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాక ఎలిమెంటరీ లెవల్లోని పిల్లలకు బ్రిడ్జ్ కోర్సును నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాఠ్యాంశాలను కూడా మార్చుతున్నట్టు వెల్లడించారు.

 

పాఠశాల విద్యార్థులకు జగనన్న కానుక ద్వారా బ్యాగ్, యూనిఫాం, బూట్లు అందించనున్నట్టు మంత్రి వెల్లడించారు. దీని విలువ 1500 రూపాయలు ఉంటుందని సూచనప్రాయంగా తెలిపారు. అంతేకాక ఆంగ్ల మాధ్యమం అమలుకు, అమ్మఒడి కార్యక్రమనికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించినట్లు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: