బీజేపీ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్నేహ బంధం బలపడుతున్నదనడానికి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయమే ఉదాహరణ గా పేర్కొనవచ్చు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించాలని భావించింది . ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , కేంద్రానికి దరఖాస్తు పెట్టుకుంది .

 

అయితే అప్పట్లో స్టీఫెన్ రవీంద్ర ను ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించడానికి ససేమిరా అన్న కేంద్ర ప్రభుత్వం , తాజాగా స్టీఫెన్ రవీంద్ర ను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించుకునేందుకు జగన్ సర్కార్ కు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తో స్నేహాన్ని కోరుకుంటున్న బీజేపీ , ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్న  వాదనలు లేకపోలేదు .

 

గత కొన్నాళ్ల నుంచి ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం జగన్ ప్రయత్నించగా, ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంభిస్తూ వచ్చిన ప్రధాని కార్యాలయం , ఢిల్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన వెంటనే ఖరారు చేయడం పరిశీలిస్తే , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్నేహాన్ని ... బీజేపీ నాయకత్వం కోరుకుంటున్నట్లుగా స్పష్టం అవుతోంది . ప్రధాని మోదీ దాదాపు గంట సేపు సమావేశమైన జగన్ , ఆ మర్నాడే కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి పిలుపు రావడం తో హస్తిన కు వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు .

 

జగన్  ఢిల్లీ పర్యటన ముగిసిందో లేదో , ఆంధ్ర ప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ గా తాను ఏరికోరి ఎంచుకున్న స్టీఫెన్ రవీంద్ర ను నియమించుకునేందుకు జగన్ సర్కార్ కు ,  కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పరిశీలిస్తే , భవిష్యత్తులో బీజేపీ , వైస్సార్ కాంగ్రెస్ మధ్య స్నేహం చిగురించడం ఖాయంగానే కన్పిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: