ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ భూతాన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా చైనాలో మృతుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. పరిస్థితి రోజు రోజుకు తీవ్రమవుతున్నట్టుగా చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న హుబూ ప్రావిన్స్‌ ప్రాంతంలో మరిన్ని కఠిన నియమాలు అమలు చేస్తోంది. ట్రాఫిక్‌ ఆంక్షలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడరాదని ఆదేశాలు జారీ చేసింది.


కరోనా కారణంగా మార్చి 5వ తేదీన జరగాల్సిన దేశ అత్యున్నత నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌పీసీ) సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చైనా అధికార మీడియా జిన్హువా పేర్కొంది. కరోనా ప్రభావం అతి ఎక్కువగా ఉన్న వుహాన్‌నగరానికి మరో 30 వేల వైద్య సిబ్బందిని పంపుతున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం మీద ఉన్న ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లలో పనిచేసే 11వేల మంది వైధ్యులని వుహాన్‌ పంపామని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

 

ఈ వైరస్‌ కారణంగా సోమవారం ఒక్కరోజే 105 మృతి చెందటంతోపాటు, 2,048 మందికి వైరస్‌ సోకినట్టుగా కొత్తగా గుర్తించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,770కు, బాధితుల సంఖ్య 70,548కు చేరుకుందని చైనా ప్రభుత్వం తెలిపింది. వైరస్‌ భయంతో జపాన్‌ రాజధాని టోక్యో తీరంలో నిలిపేసిన ఓడలో మరో 99 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో ఓడలోని 3,711 మందిలో 454 మందికి వ్యాధి నిర్థారణ కాగా వీరిలో భారతీయులు కూడా ఉన్నట్టు సమాచారం.

 

ప్రస్తుతం కోవిడ్‌గా వ్యవహరిస్తున్న కరోనా భయంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై ఆంక్షలు జపాన్‌ ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. పలు అధికారిక కార్యక్రమాలను సైతం జపాన్‌ రద్ధు చేసింది. చైనాలో రోగులకు వైద్యం అందిస్తున్న బృందాలకు అవసరమైన మాస్కులు, గ్లవ్‌లు, సూట్స్, ఇతర సామగ్రితో కూడిన ప్రత్యేక విమానాన్ని ఈ వారంలో వుహాన్‌ కు పంపనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: