రాజకీయాల్లో విమర్శలు - ప్రతి విమర్శలు సహజం. వాదన, ప్రతివాదన తోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ ఆ వాదన నోటి దురుసుగా మారకూడదు. అధికారం, అణుకువ తీసుకురావాలి కానీ అహంకారం కాదు.. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం రెచ్చిపోయి మాట్లాడితే.. అది భవిష్యత్తులో ప్రమాదకరం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

 

ఇప్పుడు వైసీపీలో కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తూ పార్టీని ఇబ్బందుల్లో నెట్టేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అలాగే మాట్లాడారు.. పీకే అంటే కొందరికి పవన్ కల్యాణ్ కావచ్చేమో.. కానీ పిచ్చికుక్క అంటూ ఆయన మాట్లాడటం.. సొంత పార్టీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. కరొనా వైరస్‌కు మందు కనిపెటొచ్చు కానీ.. టీడీపీ నేతల పిచ్చికి మందు కనిపెట్టలేమన్నారు జోగి రమేశ్.

 

అంతేనా.. ఆయన ఏ ఒక్కరినీ వదిలి పెట్టలేదు.. ఐటీ దాడులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్న జోగి రమేశ్... నిన్నటి వరకు చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌తో మాకేం సంబంధం అన్న టీడీపీ నేతలు.. ఇవాళ ఎందుకు మీడియా ముందుకు వస్తున్నారని జోగి రమేష్‌ ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం లేకుండా టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని అంటూనే ఆయన మాత్రం నోరు పారేసుకున్నారు. " స్వయం ప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు, అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు, లోక జ్ఞానం లేని లోకేష్, బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి, రాజకీయ పరిజ్ఞానం లేని పవన్‌ కల్యాణ్‌ లాంటి వాళ్ల రోగం నయం చేసే మందు కనిపెట్టే పరిస్థితి లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.. పాపం.. ఆయన మాత్రం అదుపు తప్పారు. ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే వైసీపీకి కష్టమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: