జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలను మోసం చేశాడని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమ్మ ఒడి పథకం కోసం బీసీ కార్పోరేషన్లు, బీసీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేస్తూ ఆ కులాలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాగైతే బడుగు వర్గాలు త్వరలోనే జగన్ కు బుద్ది చెబుతాయన్నారు.

 

 

ఈ విమర్శనలను వైసీపీ నేతలు కూడా దీటుగా నే ఎదుర్కొంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పందించారు. ప్రభుత్వం బీసీలను మోసం చేశాడని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తుచేశారు. అందులో 2.65 లక్షల మంది బీసీలేనన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో 95 వేల మంది బీసీలే ఉన్నారన్నారు.

 

 

అంతేకాదు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ చట్టం కూడా తీసుకువచ్చారని ఎమ్మెల్యే జోగి రమేశ్ గుర్తు చేశారు. అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల మంది తల్లులకు రూ.15 వేలు అందజేశారని, అందులో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారన్నారు. బలహీనవర్గాలను సీఎం వైయస్‌ జగన్‌ బలంగా తయారు చేస్తున్నారన్నారు.

 

 

లోకజ్ఞానం లేని లోకేష్‌కు తన ఉద్యోగం ఊడిపోతుందని భయం పట్టుకుందన్నారు. మీడియా ప్రతినిధుల సమక్షంలో ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేతలకు జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. పచ్చమీడియాను అడ్డుపెట్టుకొని ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే జోగి రమేశ్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: