చూడబోతే వ్యవహారం అలాగే అనిపిస్తోంది. శాసనమండలి రద్దు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా టిడిపి ఎంఎల్సీలు, నేతలు పెట్టుకున్న  ఢిల్లీ ప్రోగ్రామ్ తాత్కాలికంగా రద్దయ్యింది.  ఎందుకు రద్దయ్యిందయ్యా అంటే  ఎంఎల్సీలను కలవటానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ ఇవ్వలేదట.  అయితే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అపాయిట్మెంట్ ఇచ్చినా వీళ్ళు మాత్రం టూర్ ను వాయిదా వేసుకున్నారట.

 

మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపైనే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి దాదాపు ఆమోదం తీసుకున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. జగన్ బాడి లాంగ్వేజ్ చూసిన తర్వాత ఢిల్లీ పర్యటన పూర్తిగా సక్సెస్ అయినట్లే అనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మోడి, షా లకు తలబొప్పి కట్టిన విషయం తెలిసిందే. దాని పర్యవసానంగానే  అర్జంటుగా జగన్ ను మోడి పిలిపించుకున్నారు.

 

అవసరార్ధం పిలిపించుకున్నారు కాబట్టి జగన్ డిమాండ్లలో చాలా వరకూ  మోడి, షాలు సానుకూలంగా స్పందించారని వైసిపి నేతలంటున్నారు. లాజికల్ గా కూడా వినటానికి దగ్గరగానే ఉంది. అందుకే ఇదే విషయాలపై టిడిపి ఎంఎల్సీలు అపాయిట్మెంట్ కోరినా పై ఇద్దరు నిరాకరించారని సమాచారం.  వీళ్ళు కలవటానికి సమయం ఇవ్వలేదు కాబట్టి ఎంఎల్సీలు ఢిల్లీకి బయలుదేరలేదు. బాగానే ఉంది మరి వెంకయ్య అపాయిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళెందుకు వాయిదా వేసుకున్నారు ?

 

ఎందుకంటే వెంకయ్యను ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం లేదని అందరికీ తెలుసు కాబట్టే. ఇప్పటికే ఈ విషయమై వెంకయ్యను కలిసినా ఎటువంటి ఉపయోగం కనబడలేదు. అప్పటికి మోడి, షాను కలిస్తే జగన్ ప్రయత్నాలు ఆగిపోతాయా ? అంటే దానికి గ్యారెంటీ ఏమీ లేదు. కాకపోతే కలవాల్సింది మోడి, షానే కాబట్టి వాళ్ళు అపాయిట్మెంట్ ఇచ్చినపుడే ఒకేసారి ఢిల్లీకి వెళ్ళాలన్నది ఎంఎల్సీల ఆలోచన. మరి వాళ్ళిద్దరూ అపాయిట్మెంట్ ఇవ్వక పోతే ఏమి చేస్తారు ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: