ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటివద్దకు చేర్చాలనే లక్ష్యంతో 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు, సదుపాయాలు అర్హులైన వారందరికీ అందాలని సీఎం జగన్ ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కానీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై గతంలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేశాయి. 
 
అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్షంలో ఉన్న పార్టీ విమర్శలు చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని, వసూలు చేస్తున్న డబ్బులను నేతలకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. 
 
వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని వాలంటీర్లను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హెచ్చరించారు. గ్రామ, వార్డు వాలంటీర్లలో మెజారిటీ శాతం వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకు చేరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం కొందరు గ్రామ, వార్డు వాలంటీర్లు చేతివాటం చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రభుత్వం ప్రతి నెల గ్రామ, వార్డ్ వాలంటీర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వం భవిష్యత్తులో వాలంటీర్లకు గౌరవ వేతనం 8000 రూపాయలకు పెంచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. గతంలో గ్రామ, వార్డ్ వాలంటీర్లు కొందరు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు రావడంతో అధికారులు వారిని తొలగించి కొత్తవారిని వారి స్థానంలో నియమించారు. మరి నిజంగానే వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారా...? అనే ప్రశ్నకు మెజారిటీ శాతం ప్రజల నుండి లేదనే సమాధానమే వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: