వివాహేతర సంబంధం అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినప్పటికీ దాని ఫలితాలు, పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో 
ఎవ్వరూ కూడా ఊహించలేరు. తాత్కాలిక సంతోషం, సుఖం కోసం ఎంతో మంది వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ.. వారితో ఎన్నో జీవితాలు ముడిపడి ఉంటాయన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు. 


కొన్ని నిమిషాల ఆనందం కోసం జీవితాన్ని, కుటుంబాన్నే ఫణంగా పెడుతున్నారు. ఇలాంటి ప్రతి సంబంధం చివరికి క్రైంతోనే ముగిసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఒకటి... రెండు కాదు.. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు జరిగాయి. వీటివల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి.


ఒక దొంగతనం, రౌడీయిజం, చివరకు హత్య చేసినా కొన్నేళ్లకు ఆ నేరాన్ని, దాని వల్ల ఏర్పడిన మచ్చను పోగొట్టుకోవచ్చు. కానీ.. వివాహేతర సంబంధం, దాని వల్ల జరిగే నేరాలు మాత్రం సమాజం దృష్టిలో ఎప్పుడూ మాయని మచ్చలుగానే మిగిలిపోతున్నాయి. పక్కింటి వారితోనో... తెలిసిన వారితోనో... బంధువులతోనే.. కార్యాలయాల్లో పని చేసే వారితోనో... పెట్టుకుంటున్న వివాహేతర సంబంధం చివరికి కుటుంబానికి కన్నీళ్లు మిగిలిస్తోంది. ఈ సంబంధాలతో నేరస్తులుగా మారిన, ప్రాణాలు కోల్పోయిన వారి బిడ్డలు అనాథలవుతున్నారు. ఇలా వెలుగులోకి వస్తున్నవి చాలా కొన్నే అయితే, బయటకు రానివి ఎన్నో ఉంటున్నాయి.


మానసిక నిపుణులు, పోలీసులు, చివరికి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వారిని కదిలించినా వస్తున్న సమాధానం ఒక్కటే. వివాహేతర సంబంధం పెట్టుకునే సమయంలో గానీ, ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్న సమయంలో గానీ ఒక్క సారిగి వెనక్కి తిరిగి భార్యా బిడ్డలను, తల్లిదండ్రులను, స్నేహితులను చూసినప్పుడు వారు చేసేది తప్పేనని తెలుస్తోందని, అయినప్పటికీ క్షణం సుఖం కోసం ఆ ఊబిలో కూరుకుపోతున్నట్లు చెబుతున్నారు. చివరికి నేరం జరిగిన తర్వాత చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ప్రజలారా...ఆలోచించండి వివాహేతర సంబంధాల ఊబిలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకోకండి..!! మీ కుటుంబాల జీవితాన్ని నాశనం చేయకండి..

మరింత సమాచారం తెలుసుకోండి: