సంగీతం ఎలాంటి వారినైనా మైమరిపిస్తుంది. పసిపిల్లల నుండి ముసలివాళ్ల వరకూ అందర్నీ ఉత్తేజపరుస్తుంది. కొన్ని రోగాలకు మ్యూజిక్ థెరపీ కూడా అందుబాటులో ఉంది. అయితే మ్యూజిక్ లో పంటలు కూడా పండించవచ్చని, మంచి దిగుబడి సాధించవచ్చని విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీ నిరూపిస్తోంది. 

 

చుట్టూ పచ్చని కొండలు.. వాటి మధ్య వేల ఎకరాల్లో పండ్ల తోటలు .. ప్రకృతి రమణీయతకు పెట్టిందిపేరు విజయనగరం జిల్లా సాలూరు ఏజేన్సీ . చల్లటి వాతావరణం ఉండటం.. పుష్కలంగా నీరు దొరకడంతో .. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన పెద్ద పెద్ద రైతులు వేల ఎకరాల్లో ఇక్కడ అనేక రకాల వాణిజ్య, వ్యాపార పంటలు పండిస్తుంటారు ముఖ్యంగా పామాయిల్ ,అరటి  , కోక్ , మొక్కజొన్న , స్వీట్ కార్న్, జహంగీర్ జామ , హైబ్రీడ్ బొప్పాయి వంటి పంటలు పండించి  విదేశాలకి సైతం ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తుంటారు. 

 

సాలూరు ఏజెన్సీలో వినూత్న వ్యవసాయ పద్ధతికి తెరతీసారు ఓ ఇద్దరు తండ్రీ కోడుకులు. రావుల పాలెంకి చెందిన యలమర్తి చిట్టి బాబు , కిరణ్ కు.. 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. దీనిలో చాక్లెట్ తయారీకి వాడే కోకో, పామాయిల్, మొక్కజొన్న, వక్కలు, కొన్ని రకాల పండ్లు పండిస్తున్నారు. సాధారణంగా కోకో   మొక్కలు 15 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు మాత్రమే వేడిని తట్టుకుంటాయి. వేడి ఎక్కువగా ఉన్నా లేదా చలి ఎక్కువగా ఉన్నా కోకో మొక్కలు చనిపోతాయి. అందుకే వీటిని కొబ్బరి లేదా ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తారు. 

 

కానీ రావులపాలెంలో మాత్రం దాదాపు 30 ఎకరాల్లో కోకో పంట వేశారు. ఎలాంటి నీడ లేని చోటే మొక్కలు నాటారు.    పెద్ద పెద్ద చాక్లెట్ కంపేనీలైన క్యాడ్ బరీ, నెస్లే ప్రతినిధులు, ఉద్యానవన శాఖ అధికారులు కూడా కోకో మొక్కలు చనిపోతాయని హెచ్చ్రించారు. అనుకున్నట్టుగానే కోకో పంటకు చిన్న సైజు తెగుళ్లు కూడా వచ్చాయి. అయితే ఇక్కడే రైతులు వినూత్నంగా ఆలోచించారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ కాలేజ్ లో మ్యూజిక్ థెరపీ గురించి తెలుసుకుని.. తమ వ్యవసాయ క్షేత్రంలో అదే పద్ధతి అమలు చేశారు. 

 

వ్యవసాయ క్షేత్రం అంతటా ప్రత్యేక మ్యూజిక్ సిస్టమ్ అమర్చారు. ఉదయం , సాయంత్రం .. మొక్కలకి శాస్త్రీయ సంగీతం, వేద మంత్రాలని లౌడ్ స్పీకర్లో వినిపించారు. దీంతో పాటు పిరమిడ్ ధ్యాన పద్ధతి కూడా ఫాలో అయ్యారు. ఎకరానికి నాలుగు చొప్పున వ్యవసాయ క్షేత్రమంతా చిన్న పిరమిడ్ లను ప్రతిష్ఠించారు. దీంతో పంటలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. కోకో చెట్లకు ఎలాంటి చీడా పట్టలేదు. భారీ దిగుబడులు సైతం సాధ్యమయ్యాయి. కోకో పంట సాధారణంగా ఎకరాకి 500 కిలోల దిగుబడి వస్తుంది. కానీ ఈ వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ఏకంగా వెయ్యి కేజీల దిగుబడి వచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

 

ఈ వ్యవసాయ క్షేత్రానికి మరో విశిష్టత కూడా ఉంది. గుజరాత్ , మహా రాష్ట్ర నుండి ప్రఖ్యాత మైన గిర్ జాతికి చేందిన ఆవులను తెచ్చి.. ఇక్కడి క్షేత్రంలో సేంద్రీయ ఎరువుల తయారీకి ఉపయోగిస్తున్నారు. గిర్ జాతి ఆవుల నుంచి వచ్చే గో పంచకంతో జీవామృతం తయారౌతోంది. బెల్లం ఉలవపిండిని కలిపి భారీ ట్యాంక్ లలో నిలువ ఉంచుతున్నారు.  అలా నిలువ ఉన్న ద్రావణాన్ని  ఫిల్టర్ బెడ్ల ద్వారా ఫిల్టర్ చేసి .. వచ్చిన జీవామృతాన్ని డ్రిప్ మోటార్లద్వారాప్రతీ మొక్కకు అందిస్తున్నారు. దీంతో దిగుబడి భారీగా ఉంటోంది. రసాయనాల ఖర్చు సైతం బాగా తగ్గింది.  మ్యూజిక్ సిస్టమ్ తో దిగుబడి పెరగడమే కాకుండా.. తమకు కూడా ఆహ్లాదకరంగా ఉందంటున్నారు వ్యవసాయ కూలీలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: