కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆదేశాల మేరకు అవనిగడ్డ డిఎస్పీ ఎమ్.రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అవనిగడ్డలో మునుపెన్నడూ జరగని విధంగా మొదటిసారిగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన కార్డాన్ సెర్చ్ అవనిగడ్డ లంకమ్మమాన్యం కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా జల్లెడ పట్టి సోదాలు నిర్వహించారు. నేర చరిత్ర, అనుమానాస్పద వ్యక్తుల నుండి వేలిముద్రలు సేకరించారు.

 

అవనిగడ్డలోని సమస్యాత్మక ప్రాంతమైన లంకమ్మమాన్యంలో పోలీసులు ఇటువంటి తనిఖీలు నిర్వహించడంతో కాలనీ ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల, కూచిపూడి పోలీస్ స్టేషన్ల సబ్ ఇనస్పెక్టర్లు బృందాలుగా ఏర్పడి, సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో తెల్లవారకుండానే కాలనీ మొత్తాన్ని జల్లెడ పట్టి, ఇళ్లలోకి వెళ్లి క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 23 మోటారు సైకిళ్లను, ఒక ప్యాసింజర్ ఆటో, ఒక మారుతి 800 కారుని స్వాధీనం చేసుకుని అవనిగడ్డ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 

మచిలీపట్నం నుండి వచ్చిన స్పెషల్ టీం పోలీస్ సిబ్బంది తనిఖీలు జరుగుతున్నంతసేపు కాలనీ చుట్టూ పహారా కాశారు. ఈ సందర్బంగా అవనిగడ్డ సిఐ బి.భీమేశ్వర రవికుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తామని, సమాజంలో 99% మంది చట్టాలకు లోబడి ప్రశాంతంగా జీవిస్తున్నారని, కేవలం ఒక్కశాతం ప్రజలు మాత్రమే చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

 

అటువంటి వారి ఆగడాలను నిర్ములించడానికే కార్డాన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ, చల్లపల్లి సిఐ లు బి.బి.రవికుమార్, వెంకట నారాయణ, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల, కూచిపూడి ఎస్ ఐ లు  సందీప్, చల్లా కృష్ణ, పి. రమేష్, నాగరాజు, రామకృష్ణ, హాబీబ్ బాషా, స్పెషల్ టీం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: