ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌తంలో తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓ కేసుకు సంబంధించి బ్రీఫ్‌డ్‌మీ అంటూ.. దొరికిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, దాని నుంచి ఎంతో కొంత ఉప‌శ‌మ‌నం ఆయ‌న‌కు ల‌భించింది. కానీ, ఇప్పుడు తాజాగా ఐటీ కేసులో మాత్రం ఆయ‌న అడ్డంగా దొరికిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా కార్యాలయం, నివాసాల్లో ఇటీవ‌ల ఐటీ సోదాలు జ‌రిగాయి.

 

దీనికి సంబంధించి ఆ శాఖ 13 పేజీల పంచనామాను విడుద‌ల చేసింది. దీనిని పరిశీలిస్తే  చంద్ర‌బాబు చుట్టూ ఏదో అల్లుకుంటోంద‌ని అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అక్కడి నుంచి వెయ్యికి పైగా డాక్యుమెంట్లు (పత్రాలు), రెండు బ్యాంకు లాకర్లు స్వాధీనం చేసుకున్నట్లు పంచనామాలో ఐటీ శాఖ పేర్కొంది. పంచనామాలోని 5, 6వ పేజీల్లో ఈ వివరాలున్నాయి. ఒక్కో డాక్యుమెం ట్‌ ద్వారా రూ.కోట్లలో కమీషన్లు చేతులు మారినట్లు ఐటీ శాఖ గుర్తించింది.

 

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రా,  లోకేష్‌ సన్నిహితుడు నరేన్‌ చౌదరికి చెందిన డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న వేలాది డాక్యుమెంట్లలోనూ ఇదే రీతిలో కమీషన్లు చేతులు మారినట్లు వెల్లడించింది. రూ.2 వేల కోట్లకుపైగా దోపిడీ చేశారని స్పష్టం చేసింది. ఈ సొమ్మంతా ఎక్కడికి చేరిందన్నది ప్రముఖుడి మాజీ పీఎస్‌ నివాసాల్లో స్వాధీనం చేసుకున్న వేలాది డాక్యుమెంట్లు, డైరీలలో అక్షరబద్ధం చేయడాన్ని గుర్తించింది.

 

కమీషన్ల రూపంలో వసూలు చేసిన నల్లధనాన్ని సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్సులోకి రప్పించి ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నది పీఎస్‌గా పనిచేసిన వ్యక్తి ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. వీటి ఆధారంగా ముఖ్య‌నేత‌ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ఈ అక్రమాల బాగోతంలో స్వల్ప భాగాన్ని ఐటీ శాఖ రట్టు చేయడం కలకలం సృష్టించిన విష‌యం తెలిసిందే.     

మరింత సమాచారం తెలుసుకోండి: