మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కమలం పార్టీకి సైలెంట్ గా షాక్ ఇచ్చారు. ఒక ప్రతిపక్షపార్టీలోని కార్యకర్తలను మరో ప్రతిపక్షపార్టీలో చేర్చుకోవటం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన  విషయమే.  బిజెపికి చెందిన నేతలు, కార్యకర్తలు సుమారు 300 మంది గంటా సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు. ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత బిజెపి నేతలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.  ఒకవైపు టిడిపి లో నుండే నేతలు ఎలా బయటకు వచ్చేయాలా అని అవస్తలు పడుతున్న సమయంలోనే  తమ పార్టీ నుండి టిడిపిలో ఎందుకు చేరారో కమలనాధులకు అర్ధం కావటం లేదు.

 

మామూలుగా అయితే అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఎత్తుకు పై ఎత్తులు సహజం. దానికి తగ్గట్లే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి నుండి కానీ ఇతర ప్రతిపక్షాల నుండి కానీ అధికార వైసిపిలో చేరటానికి నేతలు, కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తారన్న విషయం తెలిసిందే. కానీ దీనికి రివర్సుగా బిజెపిలో నుండి టిడిపిలోకి నేతలు, కార్యకర్తలు చేరటమే విచిత్రంగా ఉంది.

 

విశాఖపట్నం నగరంలోని ఉత్తర నియోజకవర్గానికి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మామూలుగా గంటాకే పార్టీలు మార్చే అలవాటు ఎక్కువుంది. మొన్నటి ఎన్నికల్లో  ఘోరమైన దెబ్బ తగిలిన దగ్గర నుండి టిడిపి ఎంఎల్ఏ వైసిపిలో చేరిపోతారనే ప్రచారం బాగా జరుగుతోంది. కాకపోతే ఇతర పార్టీల్లో నుండి ప్రజా ప్రతినిధులను చేర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గేట్లు తెరవకపోవటంతో ఇంకా టిడిపిలో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కంటిన్యు అవుతున్నారు.

 

ఫిరాయింపులకు జగన్ గేట్లెత్తేసుంటే టిడిపి దాదాపు ఈపాటికి ఖాళీ అయిపోయేదనటంలో సందేహమే లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో బిజెపిలో నుండి 300 మంది టిడిపిలో చేరటమంటే పెద్ద విషయమనే చెప్పాలి. మరి గంటా టిడిపిలో ఎంతకాలం ఉంటారో తెలీదు కానీ గంటాను నమ్ముకుని వచ్చిన వారి పరిస్ధితి  అప్పుడు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: