గత కొన్ని రోజుల నుండి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో కేరళ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనా నుండి కేరళకు వచ్చిన ముగ్గురు కరోనా వైరస్ బారిన పడగా చికిత్స అనంతరం ముగ్గురు కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన ముగ్గురు క్షేమంగానే ఉన్నారు. కానీ తాజాగా మన దేశంలో కరోనా బారిన పడి ఒక వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తోంది. 
 
ఈరోజు మధ్యాహ్నం నుండి తమిళనాడు రాష్ట్రంలో ఒక వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం చైనా నుండి 115 మంది తమిళులు చెన్నైలోని పుదుకొట్టైకి వచ్చారు. 115 మందిలో ఒకరైన శక్తికుమార్ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఫిబ్రవరి 4వ తేదీన చైనా నుండి వచ్చిన శక్తి కుమార్ కరోనా లక్షణాలతో మధురైలోని ఆస్పత్రిలో చేరాడు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం శక్తి కుమార్ మరణించాడు. చైనా నుండి వచ్చిన శక్తి కుమార్ అనారోగ్యం పాలవడం, చనిపోవడంతో కరోనా బారిన పడే చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. వైద్యులు అధికారికంగా ఈ విషయం గురించి ప్రకటన చేయాల్సి ఉంది. ఆరోగ్య శాఖ అధికారులు శక్తి కుమార్ కరోనా వలనే చనిపోయాడా...? లేదా...? అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 
 
చైనాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కరోనా పేరు వింటేనే గజగజా వణికిపోతున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటికే దాదాపుగా 1800 మంది మృతి చెందగా 72,000 మందికి పైగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ కు వ్యాక్సిన కనిపెట్టేందుకు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: