త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో వైసీపీ కి ఉన్న అసెంబ్లీ సీట్ల ప్రకారం నాలుగు రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపు నుంచి కాబోయే నలుగురు అభ్యర్థులు ఎవరా అనే ఆరాలు మొదలయ్యాయి. ఏపీలోశాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టడం, రాబోయే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోబోతుండడంతో ఎమ్యెల్సీ లా ద్వారా మంత్రి పదవులు పొందిన జగన్ కు వీర విధేయులైన ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వారికి రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చేందుకు ఇప్పటికే జగన్ నిర్ణయం తీసేసుకున్నారు.


ఇక మరో రెండు సీట్లలో చాలా మంది పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవి పేరు కూడా వినిపిస్తోంది. ఆయన పేరుతో పాటు రెండు సీట్లు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే అకస్మాత్తుగా వైసీపీ తరఫున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ లో ఇప్పుడు వైయస్ షర్మిల పేరు కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీలోని కొంతమంది కీలక నాయకులు జగన్ కు సూచించినట్లుగా తెలుస్తోంది. ఆమెను పార్టీలో యాక్టివ్ చేయడం ద్వారా పార్టీకి మరింత బలం పెరుగుతుందని, ఇప్పటికే ఆమె రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన తీరు, ఆమె వాగ్ధాటి పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలోనూ చూశాం కనుక  ఆమె పార్టీలో యాక్టివ్ గా ఉంటే ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ బాగా ఉంటుందని, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి , పవన్ కు కూడా చెక్ పెట్టేందుకు బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. 


షర్మిలను రాజ్యసభకు పంపించడం ద్వారా జాతీయస్థాయిలో వైసిపి ఇమేజ్ మరింతగా పెరుగుతుందని చెప్పినట్టు తెల్సుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలోనూ.. ఏపీలోనూ జగన్ తర్వాత వ్యవహారాలు చక్కబెడుతూ వస్తున్నారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు షర్మిలకు రాజ్యసభ స్థానం కల్పిస్తే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని ఈ ప్రతిపాదనను జగన్ దగ్గర పెట్టినట్లు సమాచారం.


 అయితే గతంలోనే షర్మిలకు వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని పెద్దఎత్తున ప్రచారం జరిగినా జగన్ పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గట్టి వాయిస్ ఉన్న షర్మిలను రంగంలోకి దించితే ఫలితం ఉంటుందనే ఆలోచనలో జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక షర్మిల కూడా  క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు చాలా కాలంగా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీనిపై జగన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: