సీఐడీ అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌‌కు పాల్పడ్డారనే ఆరోపణల విషయంలో దర్యాప్తును వేగవంతం చేసిన విషయం తెలిసిందే. సీఐడీ అధికారులు అమరావతి భూముల గురించి చేస్తున్న విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సీఐడీ అధికారులు అనంతపురం జిల్లాలోని నిరుపేదలు అమరావతిలో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 
 
ఈరోజు సీఐడీ అధికారులు అనంతపురం జిల్లాకు వెళ్లి కనగానిపల్లి తహశీల్దార్ ఆఫీస్ లో సోదాలు నిర్వహించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌‌కుకు పాల్పడిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు తెల్ల రేషన్ కార్డుదారులు ఉండటంతో ఈరోజు కనగానిపల్లి ఆఫీస్ లో సోదాలు జరిగాయి. సీఐడీ దర్యాప్తులో అమరావతిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 
 
సీఐడీ అధికారులు కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఇద్దరు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఎలా కొనుగోలు చేశారనే విషయం గురించి వివరాలను సేకరిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరికైనా బినామీలుగా ఉన్నారా...? లేక ఈ భూముల కొనుగోలు వెనుక మాజీ మంత్రి పరిటాల సునీత హస్తమేమైనా ఉందా...? అనే దిశగా సీఐడీ విచారణ జరుపుతోంది. 
 
రాష్ట్ర కేబినేట్ సబ్ కమిటీ కొన్ని రోజుల క్రితం అమరావతిలో 4,000 ఎకరాల భూముల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు స్పష్టం చేసింది. కేబినేట్ సబ్ కమిటీ భూముల కొనుగోలుకు సంబంధించిన నివేదికను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. సీఐడీ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయడంతో పాటు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌‌కు పాల్పడిన ఇతరుల వివరాలను కూడా సేకరిస్తోంది.                              

మరింత సమాచారం తెలుసుకోండి: