విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపిన ముగ్గురు అక్కచెల్లెల్ల మిస్సింగ్ కేసు  కీలక మలుపు తిరిగి సుఖాంతం అయింది. నేను చనిపోతున్నాను.. మా కోసం వెతుకకొద్దు  అంటూ మెసేజ్ పెట్టి కనిపించకుండా పోయిన ముగ్గురు పిల్లల ఆచూకీ తాజాగా లభించింది. పోలీసులకు ఎంతో సవాలుగా మారిన ఈ కేసు ప్రస్తుతం ముగిసింది. ఇంతకీ ఏం జరిగింది... చనిపోతున్నా మంటూ మెసేజ్ పెట్టిన చిన్నారులు ఎక్కడికి వెళ్లారు... చివరికి ఆచూకీ  ఎలా లభించింది తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. విశాఖ ద్వారకా నగర్లో నివాసం ఉండే ఎర్రన్నాయుడు లక్ష్మి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు.. అమ్మా మేము  చనిపోతున్నాము  మా కోసం వెతుకొద్దు నాన్నను  జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టారు. 

 


 ఆ తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో పిల్లల మెసేజ్ చూసి ఎంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు హుటాహుటిన పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఈ ముగ్గురు అక్కచెల్లెల్ల మిస్సింగ్ కేసును పోలీసులు కూడా ఎంతో సవాల్గా తీసుకున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఆ ముగ్గురు అమ్మాయిల ఆచూకీని తెలుసుకునేందుకు మూడు స్పెషల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. కానీ ఇంతలో అమ్మాయిల ఆచూకీ లభించింది. 

 

 సోమవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ముగ్గులు చిన్నారులు ఈరోజు తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మేము క్షేమంగానే ఉన్నామని చెన్నై కి వచ్చాము  అంటూ సమాచారం అందించారు. దీంతో సంబరపడిపోయినా తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. తమ బిడ్డలను క్షేమంగా ఇంటికి తీసుకు రావాలి అంటూ వేడుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి వైజాగ్ పోలీసులు చెన్నై పోలీసులను సంప్రదించినట్లు సమాచారం. ఆ ముగ్గురు యువతులను విశాఖ తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చనిపోతామని తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి కనిపించకుండా వెళ్లిన  ముగ్గురు చిన్నారులు చెన్నైకి ఎందుకు వెళ్లారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: