రాజకీయాల్లో బాధ్యతలు పెరిగితే, నాయకుల మాట తీరులో కూడా చాలా మార్పు వస్తుంది. ప్రత్థ్యర్ధి పార్టీల మీదకు మరి దూకుడుగా వెళ్లకుండా, అర్ధవంతమైన విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయం ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడానికి చూస్తారు. తాము చేస్తుంది ఏంటి? ప్రత్యర్ధి పార్టీలు ఏం చేస్తున్నాయనే విషయంలో తేడాలు వివరిస్తారు. సరిగా ఇలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. సీఎం అయ్యాక ఆయనలో చాలా మార్పు వచ్చింది. రాష్ట్రానికి తండ్రి హోదాలో ఉండి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.

 

అయితే జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇలా లేరని చెప్పొచ్చు. మొన్న ఐదేళ్లు ఆయన టీడీపీపై కత్తులు దూశారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబుని సమయం బట్టి ఏకీపారేశారు. ఆయన చేసిన తప్పులని ఎత్తి చూపుతూనే, కాస్త దూకుడుగానే విమర్శలు చేశారు. అప్పుడప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక పాదయాత్ర సందర్భంగా అయితే ప్రతిరోజూ, చంద్రబాబు చేసే తప్పులని చెబుతూనే, ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

 

ఇక ప్రతిపక్షంలో ఆ స్థాయి దూకుడు ప్రదర్శించిన జగన్, సీఎం అవ్వగానే చాలా మారారు. ప్రతిపక్ష ప్రతి విషయాన్ని రాజకీయం చేసినా, దానికి తొందరగా స్పందించకుండా ఉన్నారు. అలా స్పందించకుండా ఉండటం వల్ల టీడీపీ విమర్శలు గాలిలోనే కలిసిపోయాయి. అయితే ప్రజలు కోసం చేసే మంచి కార్యక్రమాలపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తుంటే మాత్రం, దానికి తగ్గట్టుగానే నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూనే, సరదా కౌంటర్లు ఇస్తున్నారు.

 

తాజాగా కూడా కర్నూలు సభలో ఆయన చంద్రబాబుకు చిన్నగా చురకలు అంటించారు.  ఆరోగ్య శ్రీలో క్యాన్సర్‌కి మందు ఉంది గాని ఆసూయతో వచ్చిన కడుపు మంటకి వైద్యం లేదని, చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది గాని, చెడు దృష్టికి ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు అని, వయసు మళ్ళితే చికిత్సలు ఉన్నాయి గాని, మెదడు కుళ్ళితే చికిత్సలు లేనే లేవు అంటూ పంచ్‌లు వేశారు. ఇలా జగన్ పంచ్‌లని బట్టి చూస్తుంటే, చంద్రబాబుకు ఎక్కడ ఎలా ఇవ్వాలో అలాగే ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే సీఎం హోదా వచ్చాక జగన్‌లో చాలా మార్పు వచ్చిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: