విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనున్నాయా? వైసీపీలో పెద్ద ఛేంజ్ రానుందా? అంటే ప్రస్తుతం విజయవాడలో ఉన్న పరిస్తితులని చూస్తుంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. మామూలుగా రాష్ట్రం రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడ పార్లమెంట్‌లో సత్తా చాటాలని వైసీపీ ఎప్పటి నుంచో చూస్తుంది. అయితే 2014 ఎన్నికల్లో అది సాధ్యపడలేదు.  అప్పుడు టీడీపీ ప్రభావం బాగా ఉండటంతో కేశినేని నాని సులువుగా విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్ ఓటమి పాలయ్యారు.

 

ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి కూడా ఎలా అయిన గెలవాలనే పట్టుదలతో వైసీపీ అభ్యర్ధిగా ప్రముఖ బిజినెస్‌మెన్ పీవీపీ(పొట్లూరి వర ప్రసాద్)ని బరిలోకి దింపారు. పి‌వి‌పి వచ్చిన కేశినేని నానికి చెక్ పెట్టడం కుదరలేదు. రాష్ట్రం మొత్తం జగన్ హవా ఉన్న, విజయవాడ ఎంపీ మాత్రం టీడీపీనే గెలిచింది. దీంతో మరోసారి వైసీపీకి షాక్ తగిలింది. అయితే సరైన అభ్యర్ధిని పెట్టకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని జగన్ ఓ అంచనాకు వచ్చారు. పైగా ఎన్నికల ముందు అభ్యర్ధిని ప్రకటించడం వల్ల ఇబ్బంది అవుతుందని, కాబట్టి ఇప్పుడే సరైన అభ్యర్ధిని ఇన్ చార్జ్‌గా ప్రకటించాలని జగన్ చూస్తున్నట్లు సమాచారం.

 

పి‌వి‌పికి ఎలాగో విజయవాడలో అనుకూల వాతావరణం లేదు కాబట్టి, ఆయన స్థానంలో ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన దాసరి జై రమేశ్‌కి ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అసలు దాసరి జై రమేష్ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 1998 లో విజ‌య‌వాడ లోక్‌స‌భ అభ్య‌ర్దిగా పోటీ చేసి.. అప్పటి కాంగ్రెస్ అభ్య‌ర్ది ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర చేతిలో ఓడారు. తర్వాత కొద్దిరోజులు టీడీపీలో కొనసాగినా.. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.

 

ఎలాగో విజయవాడ మీద పట్టున్న రమేశ్‌కే సీటు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పి‌వి‌పిని బరిలో దింపి ఓటమి చవిచూశారు.  ఇక ఇప్పుడు రమేశ్‌కే ఇన్ చార్జ్ పదవి ఇస్తే, వచ్చే ఎన్నికల నాటికి విజయవాడ సీటుని సొంతం చేసే అవకాశాలు మెరుగవుతాయని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో పి‌వి‌పిని పక్కనబెట్టి రమేశ్‌కు ఇన్ చార్జ్ పదవి ఇస్తారని విజయవాడ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: