ప్ర‌ముఖ ఆధ్యాత్మికవేత్త జ‌గ్గీ వాసుదేవ్ విష‌యంలో ఊహించ‌ని రెండు వివాదాలు తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై వాటర్‌ మ్యాన్‌ (జల వనరుల పరిరక్షకుడు)గా ప్రసిద్ధి చెందిన రాజేంద్రసింగ్ ఆరోపణలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. జగ్గీ వాసుదేవ్‌ తనను తాను సద్గురువుగా చెప్పుకోవచ్చని, వాస్తవానికి ఆయన దొంగబాబా అని విమర్శించారు. జగ్గీ వాసుదేవ్‌ తన భార్యను కూడా హత్యచేశారని ఆరోపించారు. వినోభాభావే భూదాన ఉద్యమం కింద కోయంబత్తూర్‌లో రైతులకు పంపిణీ చేసిన భూములను జగ్గీ వాసుదేవ్‌ కబ్జా చేశారని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తున్నదని తెలిపారు. నదుల పునరుజ్జీవనానికి మిస్డ్‌కాల్‌ ఇవ్వండి అంటూ జగ్గీ వాసుదేవ్‌ గతంలో నడిపించిన ప్రచారంపై నిప్పులు చెరిగారు. ‘ఎంత మోసం ఇది. మిస్డ్‌కాల్స్‌తో నదులు పునరుజ్జీవనం అవుతాయా?’ అని ఆయన ప్రశ్నించారు.

 

 

అయితే, తాజాగా దీనిపై ఈషా ఫౌండేషన్ క్లారిటీ ఇచ్చింది. ఈశా ఫౌండేషన్‌ స్పందిస్తూ కొంతమంది మానసిక సమతుల్యత లేకపోవడం వల్లనో, కీర్తి కోసమో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించింది. సద్గురుపై చేసిన వ్యక్తిగత ఆరోపణలు పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ప్రస్తుత కాలంలో గొప్ప గురువుల్లో ఒకరైన జగ్గీ వాసుదేవ్‌పై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివరించింది.

 

 

ఎంతో  మంచి  చేయాలని సంకల్పించిన అత్యంత గౌరవనీయమైన వ్యక్తిపై  ఈ రకమైన వ్యక్తిగత దాడి ఆశ్చర్యానికి గురిచేసినట్లు తెలిపింది. ఈశా ఫౌండేషన్ రివర్ లింకింగ్‌ను ఎప్పుడూ సమర్థించలేదు. ర్యాలీ ఫర్ రివర్స్ లేదా కావేరీ కాలింగ్‌కు రివర్ లింకింగ్‌తో ఎటువంటి సంబంధం లేదని, అనేక ప్లాట్‌ఫామ్‌లలో ఇది పదే పదే స్పష్టంగా చెప్పబడిందని ఈశా ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఫౌండేషన్ తన నది పునరుద్ధరణ ప్రాజెక్టుల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి డబ్బు తీసుకోలేదు. మహారాష్ట్రలో, వాఘరి నదీ పరీవాహక ప్రాంతంలోని అత్యంత సవాలుగా ఉన్న భూభాగంలో పైలట్ ప్రాజెక్టుపై ర్యాలీ ఫర్ రివర్స్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ యవత్మల్ లోని అత్యంత నిరాశకు గురైన కొన్ని రైతు వర్గాల జీవితాలను మార్చడానికి ఎంతగానో కృషి చేస్తోందని ఈషా ఫౌండేషన్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: