భార‌త‌దేశం త‌న సాయుధ సంప‌త్తిని మ‌రింత బ‌లోపేతం చేసుకుంటోంది. పాకిస్థాన్‌తో యుద్ధం ఎప్పుడొస్తుందో అంచనా వేయలేమని రక్షణ దళాల అధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్ కొద్దికాలం క్రితం తెలిపారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.  ప‌క్కదేశం పాకిస్తాన్ నుంచి గ‌త కొద్దికాలంగా బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు పెరుగుతున్న నేప‌థ్యంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. దేశంలోని పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు రెండు నుంచి ఐదు థియేటర్‌ కమాండ్లను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ బలగాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. దీంతోపాటుగా, 2022 నాటికి తొలి థియేటర్‌ కమాండ్‌ అందుబాటులోకి రానుందని బిపిన్ రావ‌త్‌ తెలిపారు.

 

జమ్ము కశ్మీర్‌లో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఒక థియేటర్‌ కమాండ్‌ను నెలకొల్పనున్నట్లు బిపిన్‌ రావత్‌  చెప్పారు. మిలిటరీలో చేపట్టబోయే భారీ సంస్కరణల ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు. నౌకాదళ తూర్పు, పశ్చిమ కమాండ్లను విలీనం చేసి కొత్తగా ‘ద్వీపకల్ప కమాండ్‌'ను ఏర్పాటు చేయనున్నామని, 2021 చివరినాటికి దీనికి ఒక రూపు వచ్చే అవకాశం ఉన్నదని రావత్‌ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను ఈ కమాండ్‌ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రతిపాదిత ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండ్‌ వచ్చే ఏడాది మధ్యనాటికి రూపుదిద్దుకోనుంద‌ని రావ‌త్ అదన్నారు. అమెరికా తరహాలో ప్రత్యేక శిక్షణ కమాండ్‌, అలాగే త్రివిధ దళాల్లో రవాణా తదితర అవసరాలకు కూడా మరో కమాండ్‌ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు వివరించారు. 

 

 

కాగా, ఇటీవ‌లే త‌మిళనాడులోని తంజావూరు ఎయిర్‌స్టేషన్‌లో ‘టైగర్‌షార్క్స్‌' 222 స్కాడ్రన్‌ను  వాయుసేన ఏర్పాటు చేసింది. బ్రహ్మోస్‌ క్షిపణులను మోసుకెళ్లగలిగే సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాలను దక్షిణ భారత్‌లో తొలిసారి మోహరించనున్నారు. ఈ స్కాడ్రన్‌ ప్రారంభోత్సవంలో సీడీఎస్‌  రావత్‌, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదౌరియా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భదౌరియా మాట్లాడుతూ.. హిందూ మహా సముద్రంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లను అయినా ధీటుగా ఎదుర్కొనేందుకు ఈ ఎయిర్‌స్టేషన్‌ను ఆధునిక యుద్ధ విమానాలతో బలోపేతం చేసినట్లు తెలిపారు. ఈ వాయు రక్షణ వ్యవస్థ దక్షిణ ద్వీపకల్పంలో కీలక పాత్ర పోషిస్తుందని  సీడీఎస్‌  రావత్‌ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: