తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతన్న వేళ ఆ స్థానాన్ని అందుకునేందుకు బీజేపీ ఆరాటపడుతోంది. ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి కొత్త ఆశలు రేపాయి. కాకపోతే.. ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదు. అయినా సరే.. బీజేపీ నేతలు మాత్రం టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

 

 

ఈ ప్రయత్నాల్లో భాగంగా టీఆర్ఎస్ పై మాటల దాడి తీవ్రం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా టీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కూతురు కవితను ఓడించటం ద్వారా ప్రజలు టీఆర్ఎస్‌కు గట్టి సంకేతం పంపారని కామెంట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.

 

 

తెలంగాణలో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటోందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఇటీవల కేటీఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ బదులిచ్చారు. కేటీఆర్ కు అవగాహన లేకనే కేంద్రంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు. ఒవైసీ మెప్పుకోసం కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాజకీయాల కోసమే ముస్లింలకు కేసీఆర్ 12శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని పీయూష్ గోయల్ అన్నారు. ప్రజలను అసదుద్దీన్ ఒవైసీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

 

 

ఇదే సమయంలో.. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ ప్రకటించడంపైనా పీయూష్ గోయల్ కామెంట్ చేశారు. ఇది చాలా బాధాకరం అన్నారు. భారత రాజ్యాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని విమర్శించారు. పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్రాలు వ్యతిరేకించలేవని కపిల్ సిబల్ కూడా అన్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: