దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుగాలి ప్రీతి కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు అప్పటినుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ తాజాగా సుగాలి ప్రీతి కేసు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఈ కేసును సీబీఐకు రెఫర్ చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోను న్యాయం చేస్తామని సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. 
 
నిన్న సీఎం జగన్ వైయస్సార్ కంటివెలుగు పథకం మూడో విడత 
ప్రారంభోత్సవం కోసం కర్నూలుకు వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు సీఎం జగన్ ను కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్ సుగాతి ప్రీతి కేసులో తప్పక న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడంతో పాటు వారి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 
 
సీఎం జగన్ సుగాలి ప్రీతి కుటుంబానికి ఈ విషయం గురించి మరోసారి కూలంకుషంగా మాట్లాడతానని తన వద్దకు రావాలని సూచించారు. జగన్ తన కార్యాలయ అధికారులకు సుగాలి ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు మరోసారి తీసుకురావాలని ఆదేశించారు. 2017 సంవత్సరం ఆగష్టు నెల 19వ తేదీన కర్నూలు జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. 
 
సుగాలి ప్రీతి పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు తేలడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు స్కూల్ యజమానిపై, యజమాని కొడుకుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినా 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అప్పటినుండి న్యాయం కోసం సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సీఎం జగన్ ఈ కేసును సీబీఐకు రెఫర్ చేస్తామని చెప్పటంతో తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయం చర్చనీయాంశమౌతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: