సాధారణంగా గుళ్లలో బ్రాహ్మణులే పూజారులుగా ఉంటారు. కానీ.. అరటి, కొబ్బరి చెట్లతో, పచ్చని పొలాల మధ్య, పాడి పంటలతో సందడిగా ఉండే పశ్చిమ గోదావరిజిల్లా ఉండి మండలం ఉప్పులూరులోని ఓ ఆలయంలో మాత్రం దళితులే పూజారులు. ఈ గ్రామంలో విభిన్న మతాలు, సంప్రదాయాలు, కులాలు ఉన్నప్పటికీ అందరూ సమభావంతో, కలిసిమెలసి ఉంటారు.

 

ఈ సామాజిక మార్పు ఇప్పటిది కాదు, కుల వివక్షను శతాబ్దాల కిందటే తరిమికొట్టిన చైతన్యం అక్కడి సమాజానిది. సమానత్వానికి,చైతన్యానికి మారు పేరుగా నిలిచిన ఆ గ్రామ ప్రజల ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి. అక్కడి ప్రజలు ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు దళితులకు అప్పగించడంతో, దేశంలోనే సామాజిక న్యాయం ఉన్న గ్రామంగా ఏనాడో గుర్తింపు పొందింది.

 

 

ఈ మార్పు వెనుక చరిత్ర ఏంటంటే.. ” పల్నాటి సీమలో, నాగమ్మ, బ్రహ్మనాయుడు మధ్య యుద్ధం జరుగుతున్న రోజుల్లో.. పల్నాడు లో యుద్ధమేఘాలు వీడకలేదు. బ్రహ్మనాయుడి అనుచరుడైన దళితుడు.. తిరువీధి నారాయణ దాసు అతని ఇద్దరు సోదరులతో సహా, వారు పూజిస్తున్న చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని మోసుకుంటూ క్రీ.శకం 1280 ప్రాంతంలో… పల్నాడును వీడి నూజివీడు మీదుగా సింహాచలం వలస వెళ్లారు. అక్కడే కొన్నిరోజులు స్వామి సేవ చేసుకుంటూ బతికారు.

 

 

కొంత కాలం తరువాత పల్నాడు లో పరిస్ధితులు చక్కబడి ఉంటాయని తెలిసి, తిరుగు ప్రయాణంలో గోదారి తీరంలోని ఉప్పులూరులో ఆగారు. ఒక రావి చెట్టుకింద స్వామి విగ్రహాన్ని ఉంచి, వంట చేసుకొని, స్వామి వారికి నైవేద్యం పెట్టి, అనంతరం వారు ఆ ప్రసాదాన్ని ఆరగించారు. అక్కడి నుండి వేరే గ్రామానికి బయలు దేరుతూ విగ్రహాన్ని తీసుకోవడానికి ప్రయత్నించగా ఆ విగ్రహం ఎంతకీ కదల లేదు.

 

 

ఆ విగ్రహాన్ని అలాగే ఉంచి, పక్క గ్రామానికి వెళ్లారు. ఈ లోపు ఆ విగ్రహం ఉంచిన రావి చెట్టు ఎండి పోవడం, ఊరి వారికి అనారోగ్యం కలగడంతో ప్రజలు భయపడి, ఇదంతా వైష్టవ దాసుల వల్లనే జరిగిందనే నమ్మకంతో పక్క పల్లెలో ఉన్న వైష్ణవ దాసులను పట్టుకొని చీకటి గదిలో బంధించారు. అయితే చెన్నకేశవ స్వామి ఆ గ్రామపెద్దల కలలోకి వచ్చి, వారికి హాని చేయవద్దు, వారే నా పూజారులు, నా ఆరాధనకు నియమించుకున్నాను. మీ గ్రామంలో వెలుస్తున్నాను.. అని చెప్పారట. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ఆలయంలో దళితులే పూజారులు.

 

 

గ్రామ పెద్దలంతా సమావేశమై,విగ్రహంలోని మహత్తును గ్రహించి, వైష్ణవ దాసులను విడిపించి, స్వామివారికొక చిన్న గుడిని ఏర్పాటు చేసి, వైష్ణవ దాసులనే అర్చకులుగా నియమించి, తమ ఊరిలోనే ఉంచేసుకున్నారు. మిగతా ఆలయాలకు ఇక్కడి ఆలయానికి ఉన్న ప్రధానమైన తేడా భక్తుల నుండి విరాళాలు,కానుకలు స్వీకరించక పోవడం. అందుకే ఈ అలయంలో హుండీని ఏర్పాటు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: