స‌మాజం చైత‌న్య‌వంతం అయితే ఎలాంటి ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందుతాయో తెలియ‌జేసేందుకు ఇదే నిద‌ర్శ‌నం. మ‌న ప‌న్నుల‌తో మ‌న‌కు సేవ చేయాల్సిన అధికారులు ఒక్కోసారి మ‌న‌కే షాకులు ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంటే... వారిని మ‌న జాగ‌రుక‌త ఎలా చైత‌న్య‌వంతం చేస్తుందో తెలియ‌జేసే ఉదాహ‌ర‌ణ ఇది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అధికారులు చేసిన ప‌ని వారినే అడ్డంగా బుక్ చేసింది. దెబ్బ‌కు త‌ప్పును స‌రిదిద్దుకోవాల్సి వ‌చ్చింది. అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాల్సి వ‌చ్చింది.

 

వివ‌రాల్లోకి వెళితే... ఈనెల 17న ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ హరితహారం కార్యక్రమం సందర్భంగా గోల్కొండ కోట సమీపంలో జీహెచ్‌ఎంసీ అధికారులు బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే, బల్దియా అధికారులే చట్టాన్ని ఉల్లంఘించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం)విభాగంకు ఓ వ్యక్తి సోష‌ల్ మీడియాలో ఫిర్యాదు చేయడం, అది కాస్త వైర‌ల్ అయిపోవ‌డం జ‌రిగింది. దీంతో అధికారులు జరిమానా విధించారు. అయితే, అధికారులు మ‌ళ్లీ దీనిపై నాలిక క‌రుచుకున్నారు. అది ఫ్లెక్సీనా, లేక గుడ్డతో తయారు చేసినా బ్యానరా అనేది నిర్ధారించుకోకుండా జరిమానా(ఈ-చలాన్‌)విధించినట్లు ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ తెలిపారు. దీనిపై సంబంధిత బల్దియా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం దాన్ని పరిశీలించి వారు ఏర్పాటు చేసింది గుడ్డతో చేసిన బ్యానర్‌ అయినందున ఈ-చలాన్‌ను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. త‌ద్వారా అధికారులే త‌మ నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకోవాల్సి వ‌చ్చింది.

 

కాగా, సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా జరిగిన ఇంకో ఫైన్ల ప్ర‌క్రియ చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ పుట్టిన రోజున‌ అనుమతి లేకుండా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో కటౌట్‌ ఏర్పాటు చేసినందుకు ఓ సామాన్యుడి ఫిర్యాదుకు తక్షణమే స్పందించిన జీహెచ్‌ఎంసీ.. రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై నిబంధనల మేరకు చర్యలు చేపట్టింది. రూ.5000 జరిమానా విధించింది. అక్రమంగా భారీ కటౌట్‌ ఏర్పాటుచేశారని, ఏమైనా సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పేర్కొంటూ విశాల్‌ అనే వ్యక్తి జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదుచేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు.. మంత్రి తలసానికి రూ.5000 జరిమానా విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: