భార‌త‌దేశంలోని ప‌రిణామాల‌పై ఓ కొత్త నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన ప‌రిణామాల‌ను పేర్కొంటూ ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంలో భాగంగా లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ చేసిన వ్యాఖ్య‌లు స్పందిస్తూ... ఏకంగా భార‌త్ హిందూపాకిస్థాన్‌గా మారుతోంద‌ని కామెంట్లు చేశారు. స‌ద‌రు మ‌హిళా నేత మ‌రెవ‌రో కాదు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ.

 

ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన అనంతరం ఏడు నెలల అనంత‌రం ఇల్తిజా ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లో ‘ఆర్థిక, మానసిక, భావోద్వేగ’ సంక్షోభం నెలకొందని అన్నారు. ఆర్టికల్‌ 370 అనేది తక్కిన భారతదేశంతో జమ్ముకశ్మీర్‌కు ఉన్న ‘భావోద్వేగ సంబంధం’ అని, దాన్ని తెంచేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. క‌శ్మీరీల పరిస్థితులపై మోదీ సర్కారు దుష్ప్రచారం చేస్తున్నదని ఆమె ఆరోపించారు. కశ్మీర్‌లో పర్యటించే విదేశీ ప్రతినిధులకు, తక్కిన భారత ప్రజలకు తాము సమాన హక్కులను అనుభవిస్తున్నామని చెప్తున్నారని, కానీ ప్రస్తుతం కశ్మీర్‌లో వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌) వాడే పరిస్థితి కూడా లేదని ఆమె అన్నారు. 1989లో కశ్మీరీ పండిట్లు లోయను విడిచి వెళ్లడంపై ఆమె స్పందిస్తూ.. అది అత్యంత బాధాకరమైన ఘటన అని చెప్పారు. నాటి ఘటనపై బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ‘హిందూ పాకిస్థాన్‌' దిశగా భారత్‌ పయనిస్తున్నదని ఆమె పేర్కొన్నారు.

 

కాగా, రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంలో భాగంగా లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం దేశ ప్ర‌జ‌ల‌కు విజ‌న్‌ను, డైర‌క్ష‌న్‌ను ఇచ్చింద‌న్నారు. కానీ ప్ర‌తిప‌క్షాలు మాత్రం మా కార్యాచ‌ర‌ణ ప‌ట్ల ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నాయ‌న్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆశ్చ‌ర్యపోతున్నాయ‌న్నారు.  ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని మార్చ‌డ‌మే కాదు, ఆ ప్ర‌భుత్వంతో ముంద‌కు వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యార‌న్నారు. గ‌త 70 ఏళ్ల పాల‌న త‌ర‌హాలోనే ప్ర‌భుత్వం న‌డిస్తే.. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అయి ఉండేది కాద‌న్నారు. ట్రిపుల్ త‌లాక్‌ను కూడా ర‌ద్దు అయ్యేది కాద‌న్నారు. ప్ర‌తిప‌క్షాల త‌ర‌హాలో ప్ర‌భుత్వం ఆలోచించి ఉంటే.. అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం నిజం అయ్యేది కాద‌ని ప్ర‌ధాని తెలిపారు. కర్తార్‌పూర్ కూడా వాస్త‌వ రూపం దాల్చేదికాద‌న్నారు.  రాజ‌కీయ స్థిర‌త్వం కోసం ఈశాన్యా రాష్ట్రాలు ఎన్నో ద‌శాబ్ధాలు వేచి చూశాయ‌న్నారు. కానీ మేం ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీకి స‌మీపం చేశామ‌న్నారు. బోడోలు ఆయుధాల‌ను విడిచిపెట్టిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: