చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగు చూసిన ప్రాణాంతక కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా  ఆ దేశంలో ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బారిన పడి ఇప్పటి వరకు 2 వేల మంది మృతి చెందినట్లు చైనా జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. హుబే ప్రావిన్స్‌లో నిన్న ఒక్క రోజే 136 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1749 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కొవిడ్‌-19 కేసుల నమోదు సంఖ్య 74 వేలకు చేరింది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైరస్‌ సోకి సాధారణ ప్రజలతో పాటు వైద్యులు కూడా చనిపోతుండడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న ఓ ఆస్ప‌త్రి డైరెక్టరే ఈ వ్యాధికి బలయ్యారు. 

 

వుచాంగ్‌ దవాఖాన డైరెక్టర్‌ లియూ చిమింగ్‌ కరోనా సోకి మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లు వైద్యులు తెలిపారు. లియూ చిమింగ్‌ సోమవారం రాత్రే మృతి చెందినట్లు కొన్ని చైనా ఛానళ్లు వార్తల్ని ప్రసారం చేశాయి.  అయితే వెనువెంటనే ఆయన మరణించలేదని, ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే, లియూ చిమింగ్‌ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా వైరస్‌ గురించి తొలిసారిగా గతేడాది వెల్లడించిన వైద్యుడు లీ వెన్లియాంగ్‌ను అధికారులు వదంతులను వ్యాప్తి చేయవద్దంటూ గత డిసెంబరులో హెచ్చరించడం తెలిసిందే. ఆ తరువాత ఆయన కరోనా పేషెంట్లకు చికిత్సనందిస్తూ అదే వ్యాధి సోకి మరణించాడు. ఇప్పుడు లియూ మరణాన్ని కూడా ఆ వైద్యుడి మృతితో పోలుస్తూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పలు పోస్టులు చేశారు. ఇద్దరి మరణం విషయాన్ని తొలుత చైనా అధికార వార్తా సంస్థలు ప్రసారం చేశాయని, ఆ తర్వాత ఆ వార్తల్ని తొలగించాయని ఓ నెటిజన్‌ గుర్తు చేశారు. 

కాగా, 72,436 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యిందని,1.41 లక్షల మంది వైరస్‌ ప్రభావానికి గురైనట్టు అనుమానిస్తున్నామని వైద్యులు తెలిపారు. కరోనాపై పోరాడేందుకు చైనా-ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ఉమ్మడి కార్యచరణలో భాగంగా అమెరికా తదితర దేశాలకు చెందిన నిపుణులు చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారని, వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్‌ షుయాంగ్‌ తెలిపారు. చైనాలో ప్రస్తుత పరిస్థితులు అంతగా చేజారిపోనప్పటికీ, తీవ్ర ప్రమాదకరంగానే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. మరోవైపు, జపాన్‌లోని యెకోహోమా తీరంలో నిలిపేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నౌకలోని ప్రయాణికులకు కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. వైరస్‌ సోకలేదని తేలిన దాదాపు 500 మందిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: